రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి.. 33 ఏళ్ల తర్వాత తన ఇంటికి చేరుకున్నాడు. అకస్మాత్తుగా అదృశ్యమైన అతడు.. మూడు దశాబ్దాల తర్వాత ఇంటికి తిరిగి రావడం వల్ల ఆ కుటుంబంలో ఆనందం వెల్లివెరిసింది. అయితే అతడు చనిపోయాడనుకున్న కుటుంబసభ్యులు గతేడాది మరణ ధ్రువీకరణ పత్రాన్ని కూడా ప్రభుత్వం నుంచి పొందారు. మరి ఈ 33 ఏళ్లు అతడు ఎక్కడ ఉన్నాడు? ఏం చేశాడు?
ఇదీ అసలు కథ..
జిల్లాలోని బన్సూర్ గ్రామానికి చెందిన హనుమాన్ సైనీ(75).. 1989లో దిల్లీలోని ఖరీ బావోలి ప్రాంతంలోని ఓ దుకాణంలో పనిలో చేరాడు. అదే ఏడాది అతడు ఎవరికీ చెప్పకుండా దిల్లీ నుంచి హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రాకు వెళ్లిపోయాడు. అక్కడే ఉన్న మాతా మందిరంలో పూజలు చేస్తూ గడిపాడు. దాదాపు 33 సంవత్సరాల తర్వాత హనుమాన్ సైనీ.. దిల్లీ నుంచి ఖైర్తాల్‌కు రైలులో మే 29 రాత్రి సమయంలో చేరుకున్నాడు.
కుటుంబసభ్యులతో హనుమాన్ సైనీ బన్సూర్‌కు వెళ్లేందుకు వాహనం అందుబాటులో లేకపోవడం వల్ల కాలినడకన తాతర్‌పుర్ క్రాసింగ్‌కు చేరుకున్నాడు. ఆ తర్వాత ఉదయం ఓ వాహనం ద్వారా బన్సూర్‌లోని హనుమాన్ ఆలయానికి చేరుకున్నాడు. గుడిలో ఆంజనేయుడి దర్శనం చేసుకుని తన ఇంటికి వెళ్లే దారి గురించి స్థానికులను అడిగాడు. ఆ తర్వాత తన ఇంటికి చేరుకున్నాడు. అయితే హనుమాన్ సైనీ బతికి ఉన్నాడని తెలుసుకున్న కుటుంబసభ్యులు ఒక్కసారిగా ఆశ్యర్యపోయారు. అతడి పిల్లలు, సోదరీమణులు అంతా హనుమాన్ ఇంటికి చేరుకుని బాగోగులు తెలుసుకున్నారు.
"నాన్న బతికి ఉన్నారన్న ఆశ వదులుకున్నాం. అందుకే గతేడాది మరణ ధ్రువీకరణ పత్రాన్ని పొందాం. ఇప్పుడు నాన్న ఇంటికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. దేవుడికి కృతజ్ఞతలు. నాన్న ఇంటి నుంచి వెళ్లిపోయినప్పుడు మేము చిన్నపిల్లలం" అంటూ హనుమాన్ సైనీ కుమారులు ఆనందం వ్యక్తం చేశారు.
హనుమాన్ సైనీ ప్రయాణం సాగిందిలా..
"నేను దిల్లీ నుంచి హిమాచల్ ప్రదేశ్‌లోని పఠాన్‌కోట్ వెళ్లేందుకు రైలు ఎక్కాను. ఆ రైలులోని మొదటి తరగతి కంపార్ట్‌మెంట్‌లో కూర్చున్నాను. అప్పుడు నా జేబులో రూ.20 మాత్రమే ఉన్నాయి. TTE నా దగ్గరకు వచ్చి ఛార్జీలు చెల్లించమని అడిగారు. నా దగ్గర రూ.20 ఉన్నాయని చెప్పాను. అప్పుడు అతడు తన డబ్బులతో టికెట్ తీసి నాకు ఇచ్చాడు. ఆ తర్వాత పఠాన్‌కోట్‌లో దిగి హిమాచల్‌లోని కాంగ్రా మాత మందిరానికి చేరుకున్నాను. 33 సంవత్సరాలు మాత సేవలో గడిపాను. ఇటీవలే గంగాసాగర్ వెళ్లి కోల్‌కతాలోని కాళీమాతను దర్శనం చేసుకున్నాను. ఆ తరువాత కాంగ్రా మాత నన్ను ఇంటికి తిరిగి వెళ్లిమని ఆదేశించింది. అందుకే అక్కడ నుంచి ఇప్పుడు నా ఇంటికి తిరిగి వచ్చాను" అంటూ హనుమాన్ సైనీ చెప్పుకొచ్చారు.