తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అంబులెన్స్​ కొన్న 'ఛాయ్​వాలా'.. ఉచితంగా సేవలు.. అందుకోసమేనట! - మంజునాథ్ లేటెస్ట్ న్యూస్

ప్రస్తుత రోజుల్లో అంబులెన్స్​లు సరైన సమయానికి రాకపోవడం వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అచ్చం అలాంటి ఘటనే కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తికి ఎదురైంది. అంబులెన్స్ అందుబాటులో లేక తన తండ్రిని కోల్పోయాడు. దీంతో తానే ఓ అంబులెన్స్​ను కొని ఉచితంగా ప్రజలకు సేవలు అందిస్తున్నారు. అలా చేస్తున్నాడని ఆయనేదో ధనవంతుడు అనుకోకండి.. రోడ్డు పక్కన ఉన్న చిన్న దుకాణ యజమాని మాత్రమే. ఆయన గురించి తెలుసుకుందాం రండి.

free ambulance service
ఉచితంగా అంబులెన్స్ సర్వీసు

By

Published : Mar 9, 2023, 4:56 PM IST

తనకు వచ్చిన కష్టం మరెవరికీ రాకూడదని ఆయన అనుకున్నారు. అంబులెన్స్ సదుపాయం లేక అతడు తన తండ్రిని కోల్పోయారు. ఆ బాధ వేరేవారు పడకూడదని అప్పుడే నిర్ణయించుకున్నారు. అందుకు తానే స్వయంగా ఓ అంబులెన్స్ కొనుగోలు చేసి ప్రజలకు ఉచితంగా సేవలందిస్తున్నారు. ఆయనే కర్ణాటక.. చిక్కమగళూరుకు చెందిన మంజునాథ్.

కడూరు ప్రాంతానికి చెందిన మంజునాథ్​.. రోడ్డు పక్కనే చిన్న క్యాంటీన్(టీ, తినుబండారాలు) నిర్వహిస్తున్నారు. ఆయనను అందరూ 'క్యాంటీన్ మంజన్న' అని ముద్దుగా పిలుచుకుంటారు. మంజునాథ్ తండ్రి ఐదేళ్ల క్రితం క్యాన్సర్​ బారినపడ్డారు. ఆయనను చికిత్స కోసం మంజునాథ్ చాలా ఆస్పత్రులకు తీసుకెళ్లారు. అయినా ఆయన ఆరోగ్యం కుదుటపడలేదు. ఓ రోజు ఆస్పత్రిలో ఉండగానే మంజునాథ్ తండ్రి ఆరోగ్యం క్షీణించింది. శివమొగ్గకు తన తండ్రిని తరలించేందుకు అంబులెన్స్​కు ఫోన్ చేశారు మంజునాథ్. వేరే రోగిని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు వేరే ప్రదేశానికి అంబులెన్స్ వెళ్లిందని సమాధానమిచ్చారు సిబ్బంది. ప్రైవేట్ అంబులెన్స్​కు ఫోన్ చేయగా.. వారు భారీ మొత్తంలో డబ్బులు అడిగారు. ఆఖరికి మంజునాథ్ తండ్రి ఆస్పత్రికి చేరుకునేలోపే మరణించారు.

క్యాంటీన్ వద్ద మంజునాథ్

సకాలంలో తన తండ్రిని ఆస్పత్రికి తరలించకపోవడం వల్లే మరణించాడని మంజునాథ్ చాలా బాధపడ్డారు. అప్పటి నుంచి మంజునాథ్ మనసులో అంబులెన్స్ లేక ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఏదైనా చేయాలని ఆలోచించేవారు. అలా రూ.5 లక్షలు పెట్టి తన తండ్రి పేరిట ఓ అంబులెన్స్​ను కొనుగోలు చేశారు. దీనిని 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నారు.

అంబులెన్స్ వద్ద యజమాని మంజునాథ్

"ఐదేళ్ల క్రితం నా తండ్రి క్యాన్సర్​, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారు. ఓ రోజు అకస్మాత్తుగా ఆయన ఆరోగ్యం క్షీణించింది. వెంటనే శివమొగ్గలోని మలెనాడు ఆస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. ప్రభుత్వ అంబులెన్స్‌కు ఫోన్ చేశాను. వేరే రోగిని తీసుకొచ్చేందుకు అంబులెన్స్ వెళ్లిందని చెప్పారు సిబ్బంది. ప్రైవేట్ అంబులెన్స్‌కి ఫోన్ చేయగా.. వారు భారీ మొత్తంలో డబ్బులు అడిగారు. దీంతో సకాలంలో నా తండ్రిని ఆస్పత్రికి తీసుకెళ్లలేకపోయాను. దీంతో నా తండ్రి మరణించారు. కొవిడ్ సమయంలో అంబులెన్స్‌ సకాలంలో రాకపోవడం, అందుబాటులో లేకపోవడం వల్ల చాలా మంది పేదలు ప్రాణాలు కోల్పోయారు. నా తండ్రి చనిపోయాక ఓ నిర్ణయానికి వచ్చాను. స్వయంగా అంబులెన్స్ కొని ప్రజలకు ఉచితంగా సేవ అందించాలనుకున్నాను"

--మంజునాథ్, క్యాంటీన్ యజమాని​

అయితే అంబులెన్స్​కు డీజిల్ పోయించలేని వారికి మంజునాథే డబ్బులిస్తారు. ఇప్పటి వరకు దాదాపు 35 మంది పేదలు తన ఉచిత అంబులెన్స్ సేవలను వినియోగించుకున్నరని మంజునాథ్ తెలిపారు. ఏ సమయంలో వచ్చినా అంబులెన్స్ సిద్ధంగా ఉంటుందని ఆయన చెప్పారు.

మంజునాథ్ కొనుగోలు చేసిన అంబులెన్స్
మంజునాథ్ ఏర్పాటు చేసిన ఉచిత అంబులెన్స్​లో ఆక్సిజన్ సిలిండర్, ట్రీట్‌మెంట్ కిట్‌తో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. మంజునాథ్ ఇంటి చుట్టూ 30 మంది డ్రైవర్లు ఉన్నారు. వారిలో ఎవరో ఒకరు రోగులను అంబులెన్స్​లో ఆస్పత్రికి తరలిస్తారు. వారికి రోగి కుటుంబం డబ్బులివ్వలేకపోతే మంజునాథే ఇస్తారు. మంజునాథ్​కు క్యాంటీన్​తో పాటు ఓ ట్రాక్టర్​, లారీ కూడా ఉంది. వాటి ద్వారా వచ్చిన ఆదాయంతో అంబులెన్స్ కొనుగోలు చేసి ఉచిత సర్వీసును అందిస్తున్నారు. ఈ మినీ క్యాంటీన్ యజమాని చేసిన పనికి ప్రశంసలు వెల్లువెత్తున్నాయి.

ABOUT THE AUTHOR

...view details