కరోనాతో మృతిచెందిన తమ ఆప్తులను కడసారి చూడటానికి ఎవరూ రాని పరిస్థితుల్లో.. ఓ ముస్లిం యువకుడు తెగువ చూపిస్తున్నాడు. మహమ్మారి కారణంగా చనిపోతున్న హిందువులకు వారి సంప్రదాయం ప్రకారమే అంత్యక్రియలు నిర్వహిస్తున్నాడు. ఆయనే- భోపాల్ మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన వాహన డ్రైవర్.. సద్దాం! వయసు 24 ఏళ్లు. భార్య, ఇద్దరు చిన్నారి పిల్లలతో కలిసి జీవిస్తున్నాడు.
కరోనా మృతులకు ముస్లిం యువకుడు అంత్యక్రియలు
ఎవరూ లేని కొవిడ్ మృతులకు అన్ని తానై.. హిందూ సంప్రదాయంలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నాడు మధ్యప్రదేశ్‌లోని ఓ ముస్లిం యువకుడు. ఓవైపు మతసామరస్యం, మరోవైపు తన ఉదారతను చాటుకుంటున్నాడు.
చాలా కుటుంబాలకు చెందిన వృద్ధులు, చిన్నారులు.. కరోనా కారణంగా చనిపోయిన తమ కుటుంబ సభ్యులకు అంత్యక్రియలు నిర్వహించుకోలేక పోతున్నారు. ఇలాంటి వారికి అండగా నిలుస్తున్నాడు సద్దాం. ఇప్పటివరకూ సుమారు 60 శవాలకు అంత్యక్రియలు నిర్వహించాడు. రోజూ ఇంటికొచ్చిన తర్వాత.. ప్రత్యేకంగా ఒక గదిలో ఉంటున్నాడు. నాలుగేళ్ల కుమారుడు, రెండున్నరేళ్ల కుమార్తెతో ఫోన్‌లో వీడియో ద్వారా మాట్లాడటమే తప్ప, వారిని తాను దగ్గరకు తీసుకోవడం లేదన్నాడు సద్దాం. ఎంతో కష్టమైనా.. జాగ్రత్తలు పాటించడం ద్వారా తన కుటుంబాన్ని రక్షించుకుంటున్నట్టు చెప్పాడు.
ఇదీ చూడండి:ఆక్సిజన్ ప్లాంట్లకు సాయుధ బలగాల రక్షణ