కన్నవారిని దూరం పెట్టేందుకు చాలా మంది వృద్ధాశ్రమాల తలుపు తడుతున్న ఈ కాలంలో.. కేరళ త్రిస్సూర్‌కు చెందిన 17ఏళ్ల బాలిక తండ్రి ప్రాణాలకు తన ప్రాణాలు అడ్డుపెడుతోంది. ఇక్కడ కనిపిస్తున్న బాలిక పేరు దేవానంద. 48 ఏళ్ల తన తండ్రి ప్రతీశ్‌కొన్నేళ్లుగా కాలేయసంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. అవయవ మార్పిడి చేయకపోతే ఇంకెన్నో రోజులు బతకడని వైద్యులు తేల్చిచెప్పారు. కాలేయదాతలు ముందుకు రాకపోవడంతో.. ఏం చేయాలో తెలీక వారు నరకయాతన అనుభవించారు.
తండ్రికి అవయవదానం చేసేందుకు కోర్టుకెళ్లిన మైనర్.. తొలి మైనర్ దాతగా ఘనత - కేరళ హైకోర్ట్ లేటెస్ట్ న్యూస్
కేరళలో ఓ బాలిక తన తండ్రికి పునర్జన్మ ప్రసాదించేందుకు సిద్ధమైంది. అత్యవసరంగా కాలేయ మార్పిడి.. చేయకపోతే బతకలేని 'నాన్న' కోసం తన ప్రాణాలడ్డు పెట్టి అమ్మగా మారింది. తండ్రిని బతికించుకోవాలనే సంకల్పంతో హైకోర్టును ఆశ్రయించి అనుమతి తీసుకుంది. త్వరలో సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా.. తండ్రి తిరిగొచ్చే క్షణం కోసం పడిగాపులు కాస్తోంది.
శస్త్రచికిత్సకు వైద్యులు ఇచ్చిన గడువు దగ్గర పడటంతో ప్రతీశ్ కుమార్తె దేవానంద తన కాలేయం ఇస్తానని వైద్యులకు తెలిపింది. మైనర్ కావడం వల్ల చట్టాలు అనుమతించవని వైద్యులు స్పష్టం చేశారు. దీంతో ఆ బాలిక.. కేరళ హైకోర్టును ఆశ్రయించింది. తండ్రిని బతికించుకునేందుకు సహకరించాలని వేడుకుంది. దీంతో 1994 చట్టం ఆధారంగా కోర్టు.. వైద్యనిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. బాలికకు ఈ చికిత్సతో ప్రమాదం ఉండదని నిపుణులు ఇచ్చిన రిపోర్టును కోర్టు పరిగణలోకి తీసుకుని.. అవయవదానానికి జస్టిస్ వీజీ అరుణ్ అనుమతించారు. అయితే ప్రతీశ్‌ఇందుకు ఒప్పుకోలేదు. తన కోసం కుమార్తె ప్రాణాలను పణంగా పెట్టలేనన్నాడు. కుటుంబ సభ్యులు కూడా కుమార్తె భవిష్యత్ దృష్టిలో పెట్టుకుని శస్త్రచికిత్సకు అంగీకరించలేదు. అయితే తండ్రి లేకపోతే తనకు జీవితమే ఉండేది కాదని దేవానంద వారికి సర్దిచెప్పింది. తానేమీ గొప్పదానం చేయట్లేదనీ.. తండ్రిని కాపాడుకోవడం కనీస బాధ్యత అని వివరించింది. కోర్టు అనుమతితో ఆస్పత్రి వర్గాలు శస్త్ర చికిత్సకు మిగిలిన ఏర్పాట్లు చేస్తున్నారు. దేవానంద అవయవదానంతో మరి కొన్ని రోజుల్లో తండ్రికి కాలేయమార్పిడి చేయనున్నారు.