ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరేలీ ప్రాంతంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. తన కోట్ల ఆస్తిపై కన్నేసిన వారే.. అతడ్ని హత్య చేసినట్టు తెలుస్తోంది.
భోజిపురాకు చెందిన జగన్‌లాల్ యాదవ్(52) అనే రైతు.. తమ పూర్వీకుల ఆస్తిని వారసత్వంగా పొంది కోటీశ్వరుడు అయ్యాడు. పది మంది భార్యలు కలిగిన అతడు.. ఆ ఆస్తిని తన దత్తపుత్రుడికి బదిలీ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇంతలో దారుణ హత్యకు గురయ్యాడు. మూడు రోజుల క్రితం అతడి పొలంలోనే గొంతుకోసి, తలపై రాడ్‌తో కొట్టి చంపారు. ప్రధాన రహదారికి సమీపంలో అతడికి భూములు ఉండటం వల్ల.. వాటిపై కన్నేసిన దుండగుల ఈ దారుణానికి పాల్పడినట్టు తెలుస్తోంది.
ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు స్థానిక పోలీసు అధికారి మనోజ్ కుమార్ త్యాగి. అతడి గొంతు కోసి ఉండటం సహా.. తలకూ తీవ్రంగా గాయాలైనట్టు పోస్టుమార్టంలో తేలిందన్నారు త్యాగి. 10 మంది భార్యలున్న అతడికి, పిల్లలెవరూ లేరని స్థానికులు చెప్పినట్టు వెల్లడించారు. మొదటి భార్యకు చెందిన ఓ దత్తపుత్రుడు ఆ కుటుంబంతో ఉన్నట్టు వివరించారు త్యాగి.
జగన్‌లాల్‌కు 1990ల్లో తొలి వివాహం జరిగింది. ఆ తర్వాత ఐదుగురు భార్యలు ఒకరి తర్వాత ఒకరు అనారోగ్యంతో చనిపోయారు. మరో ముగ్గురు అతడ్ని వదిలేసి వెళ్లిపోయారు. హత్యకు ముందు వరకు అతడు బంగాల్‌కు చెందిన ఇద్దరు భార్యలతో ఉండేవాడట.
ఇదీ చదవండి:'రూ.10 కోట్లు ఇవ్వకుంటే ఆ ఫొటోలు లీక్ చేస్తాం'