Udaipur murder: కొద్దిరోజుల క్రితం నుపుర్ శర్మకు మద్దతుగా సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ పెట్టిన యువకుడు దారుణ హత్యకు గరుయ్యాడు. ఇద్దరు దుండగులు అతడ్ని కిరాతకంగా నరికి తల, మొండెం వేరు చేశారు. అనంతరం ఈ పని చేసింది తామే అని వీడియో విడుదల చేశారు. ప్రధాని నరేంద్ర మోదీకి కూడా హెచ్చరికలు పంపారు. రాజస్థాన్ ఉదయ్‌పుర్‌లోని మల్దాస్ వీధిలో పట్టపగలే ఈ హత్య జరిగింది. ఘటన జరిగిన ప్రదేశం రక్తపుమడుగులా మారింది.
హత్యకు గురైన వ్యక్తి పేరు కన్నయ్యలాల్. ధన్‌మండీ ప్రాంతంలో టైలర్‌గా పనిచేస్తున్నాడు. అతని షాపులోకి ఇద్దరు వ్యక్తులు కస్టమర్లలా వచ్చారు. ఓ వ్యక్తి వద్ద కొలతలు తీసుకున్న తర్వాత కన్నయ్యపై అతడు కత్తితో దాడి చేశాడు. మరో వ్యక్తి ఈ దృశ్యాలను వీడియో తీశాడు. హత్య అనంతరం ఇద్దరూ అక్కడి నుంచి బైక్‌పై పారిపోయారు. ఆ తర్వాత కాసేపటికి వీడియోనూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
ఖండించిన సీఎం: ఈ దారుణ ఘటనను రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ ఖండించారు. ఈ హత్యతో సంబంధం ఉన్న ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. హత్యకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఎవరూ సోషల్ మీడియా షేర్ చేయవద్దని కోరారు. అందరూ శాంతియుతంగా ఉండాలని సూచించారు. కేసు విచారణను అత్యంత వేగంగా జరుపుతామని హామీ ఇచ్చారు. చట్టంప్రకారం నిందితులకు కఠిన శిక్ష పడేలా చేస్తామన్నారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ఈ హత్యను తీవ్రంగా ఖడించారు. ఈ ఘటన తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని ట్వీట్ చేశారు. ఇలాంటి కిరాతక చర్యలతో సమాజంలో భయానక వాతవరణం సృష్టించాలనుకుంటున్న వారిని తక్షణమే కఠినంగా శిక్షించాలన్నారు. మతం పేరుతో దారుణాలకు పాల్పడితే సహించేది లేదన్నారు. అందరం ఐకమత్యంగా ఉండి విద్వేషాన్ని ఓడించాలని పిలుపునిచ్చారు. శాంతియుతంగా, సోదరభావంతో ఉండాలని సూచించారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా హత్యను ఖండించారు.