కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం రాజస్థాన్లో జరుగుతోంది. అయితే గురువారం ఉదయం రాహుల్.. ఆయన తండ్రి రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేయడానికి వెళ్తున్న సందర్భంలో ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. తాను రాహుల్ వ్యతిరేకనంటూ నినాదాలు చేశాడు. దీంతో ఒక్కసారిగా పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే మంటలను ఆర్పివేసి అతడిని రక్షించారు. చికిత్స నిమిత్తం స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
భారత్ జోడో యాత్రలో కలకలం.. 'రాహుల్ వ్యతిరేకి' ఆత్మహత్యాయత్నం - రాహుల్ గాంధీ ఎదుట ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపడుతున్న భారత్ జోడో యాత్రలో ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. తాను రాహుల్ వ్యతిరేకనంటూ నినాదాలు చేశాడు. వెంటనే మంటలను ఆర్పివేసిన పోలీసులు.. అతడిని ఆస్పత్రికి తరలించారు.
అయితే భద్రతా కారణాల దృష్ట్యా రాహుల్.. తన తండ్రి విగ్రహానికి పూలమాల వేయకుండానే వెనుదిరిగారు. ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని తల్వాండి ప్రాంతానికి చెందిన కుల్దీప్ శర్మగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై భాజపా జిల్లా యూత్ అధ్యక్షుడు సుదర్శన్ గౌతమ్ స్పందించారు. అతడు గాంధీ కుటుంబానికి వ్యతిరేకి అని, తమ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
రాజస్థాన్లో భారత్ జోడో యాత్ర.. ఐదో రోజు కొనసాగుతోంది. గురువారం ఉదయం ఝలావర్ రోడ్డులో అనంతపుర గేట్ వద్ద ప్రారంభమైంది. మొత్తం 23 కిలోమీటర్లు గురువారం రాహుల్ నడవనున్నారు. ఆయన వెంట ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్, పీసీసీ చీఫ్ గోవింద్ సింగ్, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్, రణదీప్ సూర్జేవాలా పలువురు ప్రముఖులు ఉన్నారు. ఎక్కడిక్కడ ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు.