తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పెట్రోల్​ వాహనాలకు ప్రత్యామ్నాయం ఈ 'సోలార్ కార్'! - odisha mayurbhanj solar car

దేశంలో ఇంధన ధరలు నానాటికీ పెరిగిపోతున్న నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ వాహనాలకు ప్రత్యామ్నాయం కనుగొన్నాడు ఒడిశాకు చెందిన ఓ సుశీల్ కుమార్. తన మేధస్సు, సాంకేతిక పరిజ్ఞానంతో పనికిరాని వస్తువులను వినియోగించి సౌరశక్తితో పనిచేసే వాహనాన్ని రూపొందించాడు. ఈ వాహనం గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని చెబుతున్నాడు.

solar vehicle odisha
పెట్రోల్​కు నో- పనికిరాని వస్తువులతోనే సోలార్ కార్!

By

Published : Mar 29, 2021, 3:13 PM IST

పనికిరాని వస్తువులతోనే సోలార్ కార్!

ఒడిశా, మయూర్‌భంజ్‌ జిల్లాలోని కరంజియాకు చెందిన సుశీల్ కుమార్..పెట్రోల్, డీజిల్ వాహనాలకు ప్రత్యామ్నాయం కనుగొన్నాడు. తన వినూత్న ఆలోచనతో అందరి దృష్టినీ ఆకర్షించాడు ఈ రైతు. లాక్‌డౌన్ సమయంలో సాంకేతికత సాయంతో పనికిరాని వస్తువులను వినియోగించి, ఆరేడు నెలల వ్యవధిలోనే వాహనం తయారుచేసి, రోడ్డెక్కించాడు. 850 వాట్ మోటరు, 100ఏహెచ్ బ్యాటరీ, ఓ సౌరపలకను వాడి, నాలుగు చక్రాల వాహనం రూపొందించాడు.

"కొన్ని ఇనుప కడ్డీలు, టైర్లు అనవసరంగా పడి ఉన్నాయి ఇంట్లో. ఓ వాహనం తయారుచేసి, తక్కువ ధరకే విక్రయించాలని అనుకున్నాం. ఈ వాహనం నడిపేందుకు పదేళ్ల గ్యారంటీ ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నాం. ఒక్కసారి వాహనం రోడ్డెక్కిందంటే.. మరో రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. జపాన్ నుంచి బ్యాటరీ తెప్పించాం. ఈ వాహనంలో అత్యంత ప్రధానమైన భాగం బ్యాటరీయే. మిగతా భాగాలన్నీ తక్కువ ధరవే. నిర్వహణకు పెద్దగా ఖర్చేమీ అవదు."

-సుశీల్ కుమార్ అగర్వాల్, సోలార్ వాహనం రూపకర్త

సుశీల్ రూపొందించిన ఈ వాహనం గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ముగ్గురు నుంచి నలుగురు కూర్చునే అవకాశముంది. దీంట్లో వాడిన బ్యాటరీ అదనపు ఖర్చు లేకుండానే ఏళ్ల తరబడి పనిచేస్తుందని సుశీల్ చెప్తున్నాడు. ఈ వాహనం తయారీలో మరో ముగ్గురు సుశీల్‌కు సహకారమందించారు.

"లాక్‌డౌన్ సమయంలో ఉపాధి మార్గమేదీ లేదు. అన్నీ బంద్. ఆ సమయంలో సుశీల్ మనసులో ఓ ఆలోచన తట్టింది. ఓ వాహనం తయారుచేయాలనుకున్నాడు. ఇంట్లో అనవసరంగా పడి ఉన్న వస్తువులను వినియోగించి, సొలార్ వాహనం తయారుచేశాం."

-గోవింద సహానీ, సుశీల్ అసిస్టెంట్

"గతంలో నేనో వాహనం నడిపేవాడిని. ప్రస్తుతం మునా బాబు పొలంలో పనిచేస్తున్నాను. లాక్‌డౌన్ సమయంలో ఆయనొక వాహనం తయారుచేశాడు. ఇంట్లోనే రకరకాల పరిశోధనలు చేసిన తర్వాతే ఈ ఫోర్ వీలర్ రూపొందించాడు."

-ప్రతిభా సహానీ, రైతు

"లాక్‌డౌన్ కారణంగా ఎలాంటి ఉపాధీ లేనప్పుడు...సుశీల్ అగర్వాల్ ఓ ప్రణాళిక వేశాడు. నమూనా చిత్రం గీశాడు. ఆ చిత్రం చూసి, నాలుగు చక్రాల వాహనం తయారుచేశాం. మా సొంత తెలివితో ఇనుప కడ్డీలను కత్తిరించి, అతికించడం ద్వారా మొత్తానికి వాహనం రూపొందించాం."

-రమేష్ ముండా, సుశీల్ అసిస్టెంట్

కాలుష్యం నానాటికీ పెరిగిపోతూ, ఇంధనం ధరలు ఆకాశాన్ని తాకుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో.. ప్రభుత్వం కూడా ప్రత్యామ్నాయ మార్గాల కోసం అన్వేషిస్తోంది. ఫోర్ వీలర్ కొనాలనుకునే మధ్యతరగతి ప్రజల కలను సుశీల్ నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ పర్యావరణహిత వాహనాలు..కాలుష్యాన్ని తగ్గించడమే కాకుండా, ఇంధనాలు కొనుగోలు చేసే అవసరం లేకుండా చేస్తాయి. వినియోగదారులకు తక్కువ ధరకే ఈ వాహనాలను అందుబాటులోకి తేవడమే తన లక్ష్యమని చెప్తున్నాడు సుశీల్.

"పరిశ్రమల శాఖ మంత్రితో పాటు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడే ఆలోచనలో ఉన్నాం. ఐఐటీ మద్రాస్‌కు లేఖ కూడా రాశాం. అలాంటి బ్యాటరీలను ఐఐటీ మద్రాస్ భారత్‌లో తయారు చేస్తోంది. అక్కడి నుంచి బ్యాటరీలు కొనుగోలు చేయగలిగితే, ఫోర్‌ వీలర్‌ను వినియోగదారులకు 2 లక్షల రూపాయలకే అందుబాటులోకి తేవచ్చు."

-సుశీల్ కుమార్ అగర్వాల్, సోలార్ వాహనం రూపకర్త

సుశీల్ రూపొందించిన ఈ వాహనం...ఆటోమొబైల్ రంగం భవిష్యత్తుగా మారనుందని అంటున్నాడు.

ఇదీ చదవండి:'పట్టు'దలతో మహిళల సిరుల పంట

ABOUT THE AUTHOR

...view details