తెలంగాణ

telangana

By

Published : Nov 28, 2020, 5:28 PM IST

Updated : Nov 28, 2020, 5:37 PM IST

ETV Bharat / bharat

కరోనా వ్యాక్సిన్ల పురోగతి ఎలా ఉందంటే..?

కరోనా సంక్షోభం నుంచి బయటపడాలంటే.. మానవాళికి ఉన్న ఏకైక మార్గం వ్యాక్సిన్​. కరోనాకు విరుగుడు ఎప్పుడొస్తుందా? అని ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అంతర్జాతీయంగా అనేక పరిశోధన సంస్థలు, ఔషధ సంస్థలు.. టీకా తయారీలో తలమునకలై ఉన్నాయి. కొన్ని వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి అవుతున్న టీకాల పురోగతి ఎలా ఉందో తెలుసుకుందాం.

A look at top COVID-19 vaccines worldwide
ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్​ల పురోగతి ఎలా ఉంది ?

వ్యాధులను అరికట్టాడానికి వ్యాక్సిన్​లు చాలా ముఖ్యం. మానవాళి మనుగడకే సవాలు విసురుతున్న కరోనా.. మరోసారి టీకా అత్యవసరాన్ని గుర్తు చేసింది. పరిస్థితి తీవ్రత అర్థం చేసుకున్న పరిశోధన సంస్థలు వీలైనంత వేగంగా వ్యాక్సిన్​ను అందుబాటులోకి తెచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఆయా సంస్థల ప్రయత్నంతో చాలా టీకాలు తుది దశలో ఉన్నాయి.

వ్యాక్సిన్ కోసం కృషి

మహమ్మారికి విరుగుడు తీసుకొచ్చేందుకు అతి దగ్గరగా వచ్చిన కొన్ని సంస్థలు.. త్వరలోనే ప్రజలకు టీకాలు అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని.. అతి తక్కువ సమయంలోనే రూపుదిద్దుకుంటున్నాయి వ్యాక్సిన్లు. ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి కలిగిస్తున్న కొన్ని వ్యాక్సిన్ల పురోగతిని పరిశీలిస్తే...

ఫైజర్​ టీకా-BNT162b2 mRNA

అమెరికాలోని న్యూయార్క్​కు చెందిన ఫైజర్​ సంస్థ, జర్మనీకి చెందిన బయో-ఎన్​-టెక్​ సంస్థతో కలిసి సంయుక్తంగా వ్యాక్సిన్​ను అభివృద్ధి చేస్తోంది. దాదాపు 95% ఈ టీకా ప్రభావవంతంగా పని చేస్తుందని మూడో దశ పరీక్షల్లో రుజువైంది. ఈ వ్యాక్సిన్​ మార్కెట్లోకి వస్తే.. దీని ధర 20డాలర్లుగా ఉండే అవకాశాలున్నాయి. ఆ వ్యాక్సిన్‌కు అమెరికాలో ఆమోదం లభిస్తే.. ముందుగా ఆ దేశస్థులకే ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది.

ఫైజర్​ టీకా

మోడెర్నా వ్యాక్సిన్​-mRNA

ప్రముఖ ఔషధ తయారీ సంస్థ మోడెర్నా కరోనా వ్యాక్సిన్​ తయారీలో సత్ఫలితాలను సాధిస్తోంది. మూడోదశ క్లినికల్‌ ట్రయల్స్‌లో ఉన్న మోడెర్నా రూపొందించిన mRNA-1273 వ్యాక్సిన్ సమర్థంగా పనిచేస్తున్నట్లు ఇటీవల ఆ సంస్థ ప్రకటించింది. మొదటి విశ్లేషణలో భాగంగా 94.5శాతం సమర్థతతో వ్యాక్సిన్‌ పనితీరు కనబరిచినట్లు వెల్లడించింది. మోడెర్నా టీకా కొనుగోలుకు ఇప్పటికే పలు దేశాలు ఆసక్తి కనబరుస్తున్నాయి. టీకా ఒక్కో డోసుకు సంస్థ.. దేశాల నుంచి 25 నుంచి 37 డాలర్లు వసూలు చేసే అవకాశం ఉంది.

మూడోదశ క్లినికల్‌ ట్రయల్స్‌లో మోడెర్నా

ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా..కొవిషిల్డ్​

బ్రిటిష్​-స్వీడిష్​ సంస్థ ఆస్ట్రాజెనెకా.. ఆక్స్​ఫర్డ్​ విశ్వవిద్యాలయంతో కలిసి సంయుక్తంగా 'కొవిషిల్డ్'​ వ్యాక్సిన్​ను తీసుకొస్తుంది. ఆక్స్‌ఫర్డ్‌ టీకాను మన దేశంలోని సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ తయారు చేస్తోంది. ఆక్స్‌ఫర్డ్‌ టీకా ఏజెడ్‌డీ1222లో చింపాంజీల్లోని అడినోవైరస్‌ను బలహీనపర్చి వినియోగించారు. ఈ టీకా నెల వ్యవధిలో రెండు ఫుల్‌ డోస్‌లు తీసుకున్నవారిలో 62శాతం క్షణ కల్పించింది. అదే తొలి డోస్‌లో తక్కువ టీకా తీసుకొని.. రెండో డోసులో పూర్తి టీకా తీసుకొన్న వారిలో 90శాతం కొవిడ్‌ నుంచి రక్షణ కల్పించింది.

ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా సంస్థలు మహమ్మారి వ్యాపించిన సమయంలో ఈ టీకాను లాభాపేక్షతో తయారు చేయడంలేదని మొదట్లోనే ప్రకటించాయి. అందుకే వివిధ దేశాలు, ప్రభుత్వాలతో ఒప్పందం చేసుకొన్నాయి. దీని ధర ఒక్కో డోసు 2.50డాలర్లు ఉంటుంది. తొలినెలల్లో ఎక్కువ మందికి ఈ టీకా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

కొవిషిల్డ్​ టీకా

అడినోవైరస్​ 26

బోస్టన్ కేంద్రంగా పనిచేస్తున్న బెత్​ ఇజ్రాయెల్​ మెడికల్​ సెంటర్​ సరికొత్త విధానంలో.. అడినోవైరస్​-26 నుంచి వ్యాక్సిన్​ రూపొందిస్తోంది. ఏడీ26గా పిలిచే ఈ టీకాను బహుళ జాతి సంస్థ జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ తయారు చేస్తోంది. గతంలో ఎబోలాకు విరుగుడు తయారు చేసిన అనుభవం ఈ సంస్థకు ఉంది. టీకాలు, బయోలాజికల్‌ ఔషధాల తయారీ సంస్థ బయోలాజికల్‌ ఇ. లిమిటెడ్‌ సంస్థ భారత్​లో తయారు చేసేందుకు సన్నద్ధంగా ఉంది. ఈ కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ ప్రస్తుతం మూడవ దశ పరీక్షలు జరుపుకుంటోంది.

స్పుత్నిక్​-వి..

రష్యాకు చెందిన గమలేయా నేషనల్‌ రీసెర్చ్‌ సెంటర్‌ అక్కడి ఆర్‌డీఐఎఫ్‌ సహకారంతో స్పుత్నిక్‌-వి వ్యాక్సిన్‌ అభివృద్ధి చేసింది. ప్రపంచంలో తొలి కరోనా వ్యాక్సిన్‌గా ఆగస్టు నెలలో రిజిస్టర్‌ చేసుకున్న స్పుత్నిక్‌ టీకా యావత్‌ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. అంతేకాకుండా మూడో దశ ప్రయోగాల్లో భాగంగా, తొలి మధ్యంతర ఫలితాల్లో ఈ వ్యాక్సిన్‌ 92శాతం సమర్థత కనబరిచినట్లు నవంబర్ నెలలోనే ప్రకటించింది. వ్యాక్సిన్‌ రెండో మధ్యంతర విశ్లేషణ ఫలితాల్లోనూ స్పుత్నిక్‌-వి వ్యాక్సిన్‌ 95శాతం సామర్థ్యం కలిగి ఉన్నట్లు రష్యా ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఈ టీకాలోనూ అడినోవైరస్​నే వినియోగించారు. వ్యాక్సిన్‌ను రష్యాలో ఉచితంగా అందిస్తున్నట్లు ప్రకటించిన స్పుత్నిక్‌-వి పరిశోధకులు, అంతర్జాతీయ మార్కెట్‌లో ఒక డోసు ధర 10డాలర్ల కంటే తక్కువే ఉండనుందని వెల్లడించారు.

స్పుత్నిక్​-వి

కరోనా వాక్​

ఈ వ్యాక్సిన్​ను చైనా ఫార్మా సంస్థ సినోవాక్ అభివృద్ధి చేసింది. వచ్చే ఏడాది ఆరంభం నాటికి కరోనాకు వ్యాక్సిన్​ను సిద్ధం చేయనున్నట్టు చైనా ఫార్మా సంస్థ సినోవాక్​ వెల్లడించింది. అమెరికా, ఐరాస సహా ప్రపంచవ్యాప్తంగా ఈ టీకాను సరఫరా చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు స్పష్టం చేసింది. ప్రస్తుతం.. బ్రెజిల్​, టర్కీ, ఇండోనేషియాలో 24వేలమందిపై టీకాకు సంబంధించిన.. ఫేజ్​-3 క్లినికల్​ ట్రయల్స్​ జరుగుతున్నాయి. దీని ఫలితాలు వెలువడాల్సి ఉంది.

సినోవాక్ అభివృద్ధి చేసిన కరోనావాక్​

కొవాగ్జిన్‌

భారత్​ బయోటెక్​ సంస్థ.. ఐసీఎంఆర్​, నేషనల్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్ వైరాలజీలతో కలిసి సంయుక్తంగా కరోనా వ్యాక్సిన్​ను తయారు చేస్తోంది. కొవాగ్జిన్‌పై మొదటి, రెండు దశల క్లినికల్‌ పరీక్షలు పూర్తయి, ఇటీవల మూడోదశ పరీక్షలు మొదలయ్యాయి. ఇవి పూర్తయిన వెంటనే ప్రభుత్వం దీనికి ‘అత్యవసర వినియోగ అనుమతి’ ఇచ్చే అవకాశం ఉంది. పూర్తిగా దేశీయంగా రూపుదిద్దుకుంటున్న ‘కొవాగ్జిన్‌’ టీకా ప్రభుత్వ- ప్రైవేటు భాగస్వామ్య ఫలితంగా చెబుతున్నారు. దీన్ని జీనోమ్‌ వ్యాలీలోని భారత్‌ బయోటెక్‌కు చెందిన బీఎస్‌ఎల్‌- 3 సేఫ్టీ ల్యాబ్‌లో తయారు చేస్తున్నారు. ఇప్పటి వరకు నిర్వహించిన పరీక్షల్లో టీకా సామర్థ్యం 60 శాతానికి పైగానే ఉన్నట్లు నిర్ధారణ అయింది.

మూడోదశ పరీక్షల్లో కొవాగ్జిన్​

నోవావాక్స్​

అమెరికా బయోటెక్‌ కంపెనీ నోవావాక్స్‌.. కరోనా వ్యాక్సిన్​ను రూపొందిస్తోంది. కీలకమైన మూడో దశ ట్రయల్స్‌ చేపట్టిన సంస్థ.. యూకేలోని 15,000మంది వలంటీర్లపై ప్రయోగించింది. వైరస్​ ప్రోటీన్​ను విచ్ఛిన్నం చేసే విధంగా టీకా పనితీరు ఉండనుంది. వచ్చే ఏడాది 1 బిలియన్‌ నుంచి 2 బిలియన్ల వ్యాక్సిన్‌ డోస్‌లను ఉత్పత్తి చేస్తామని ఆ సంస్థ ప్రకటించింది. కరోనా వైరస్‌పై పోరులో భాగంగా ప్రభావవంతమైన వ్యాక్సిన్‌ రూపొందించడం కోసం అమెరికా ప్రభుత్వం 1.6 బిలియన్‌ డాలర్లను నొవావాక్స్‌కు ఇచ్చింది. అయితే మోడెర్నా, అస్ట్రాజెనికాలతో పోల్చితే వ్యాక్సిన్‌ రేసులో నోవావాక్స్‌ కాస్త వెనుకబడే ఉంది.

సిద్ధమవుతోన్న నోవావాక్స్

ఏడీ 5

ఈ టీకాను చైనా సంస్థ.. క్యాన్​సినో బయోలాజిక్స్​ అభివృద్ధి చేస్తోంది. ఏడీ5 అనే అడినోవైరస్​ ఆధారంగా ఈ వ్యాక్సిన్​ రూపొందుతోంది. మిలిటరీ మెడికల్​ సైన్సెస్​తో కలిసి సంయుక్తంగా దీనిని తయారు చేస్తున్నారు. ఆగస్టులోనే ఈ సంస్థ సౌదీ, పాకిస్థాన్​, రష్యా దేశాల్లో మూడవ దశ క్లినికల్​ ట్రయల్స్ ప్రారంభించింది. అత్యవసర అవసరాల పేరుతో చైనా సైన్యం జూన్​ 25నే దేశీయంగా దీనికి ఆమోద ముద్ర వేసింది.

నికోటినా బెంథమియానా..

టీకా తయారీలో వినూత్న ప్రయత్నానికి కెనడాకు చెందిన మెడికాగో సంస్థ తెరదీసింది. సిగరెట్ల తయారీ సంస్థ ఫిలిప్​ మోరిస్.. సంస్థను 'నికోటినా బెంథమియానా' మొక్కల నుంచి వ్యాక్సిన్​ తయారీకి ప్రోత్సహిస్తోంది. ఇది పోగాకు రకానికి చెందిన మొక్క. నవంబర్​ 12నే వ్యాక్సిన్​ క్లినికల్​ ట్రయల్స్​ ప్రారంభించారు. పరీక్షల్లో పాల్గొన్న వలంటీర్లకు యాంటీబాడీలు ఉత్పత్తి అవుతున్నట్లు గుర్తించారు

ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్​ల పురోగతి
Last Updated : Nov 28, 2020, 5:37 PM IST

ABOUT THE AUTHOR

...view details