Fiber Embodiment of Mother: అమ్మను మించిన దైవమున్నదా అన్నాడో సినీకవి. ఆ మాటనే అక్షరాలా పాటిస్తున్నారు కర్ణాటకకు చెందిన దేవన్న. జన్మనిచ్చిన తల్లి మరణాన్ని జీర్ణించుకోలేక, ఆమె లేని జీవితాన్ని ఊహించలేక మైనపు విగ్రహాన్ని ఇంట్లోనే ప్రతిష్ఠించి రోజూ పూజలు చేస్తున్నారు. మైనపు విగ్రహంతో పాటు పంచలోహ విగ్రహాన్ని ఏర్పాటు చేసి నిత్యం పూజిస్తున్నారు.
గదగ జిల్లా గజేంద్రగడ తాలూకాలోని లక్కలకట్టి గ్రామానికి చెందిన దేవన్న వృత్తిరీత్యా ఓ ప్రభుత్వ కళాశాలలో లెక్చరర్. ఆయనకు చిన్నప్పటి నుంచి తల్లంటే ప్రాణం. వయస్సు సంబంధిత అనారోగ్య సమస్యలతో శివగంగమ్మ 90 ఏళ్ల వయసులో గతేడాది కన్నుమూసింది. తల్లి మరణంతో డిప్రెషన్‌లోకి వెళ్లిన ఆయన.. తల్లి లేని జీవితాన్ని ఊహించుకోలేకపోయారు. ఆ సమయంలోనే దేవన్నకు తన తల్లి మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచన మదిలో మెదిలింది. దీంతో మూడు లక్షల రూపాయలు వెచ్చించి మైనపు విగ్రహం, 95 వేలు ఖర్చుచేసి పంచలోహ విగ్రహం తయారు చేయించారు. శివగంగమ్మ ప్రథమ వర్ధంతి అయిన మే 31వ తేదీన వీటిని ఇంట్లో ప్రతిష్ఠించి నిత్యం పూజలు చేస్తున్నారు.
మైనపు విగ్రహం, పంచలోహ విగ్రహాల ఏర్పాటుతో ఇంట్లో తల్లిలేని లోటు కొంతైనా తీరిందంటున్నారు దేవన్న. దేవన్నకు తల్లిమీదున్న ప్రేమను స్థానికులు ప్రశంసిస్తున్నారు.