తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నిన్న ఎమ్మెల్యే సీటులో మరో వ్యక్తి.. నేడు కత్తితో మహిళ.. అసెంబ్లీలో ఏం జరుగుతోంది? - కర్ణాటక అసెంబ్లీ మహిళ కత్తి

Karnataka Assembly Woman Knife Case : కర్ణాటక అసెంబ్లీలోకి ఓ మహిళ.. కత్తితో ప్రవేశించేందుకు యత్నించడం కలకలం రేపింది. విధాన సౌధ వద్ద తనిఖీలు చేస్తుండగా ఈ విషయం బయటపడింది. అసలేం జరిగిందంటే?

A knife found in a woman's vanity bag during an inspection at Vidhansouda
A knife found in a woman's vanity bag during an inspection at Vidhansouda

By

Published : Jul 10, 2023, 5:06 PM IST

Karnataka Assembly Woman Knife Case : కర్ణాటక అసెంబ్లీలో ఇటీవలే ఓ సామాన్య వ్యక్తి ఎమ్మెల్యే స్థానంలో కూర్చున్న విషయం మరువకముందే మరో ఘటన జరిగింది. విధాన సౌధలోకి ఓ మహిళ కత్తితో ప్రవేశించేందుకు ప్రయత్నించింది. దీంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమై.. ఆమెను గుర్తించి వెంటనే అదుపులోకి తీసుకున్నారు.

అసలేం జరిగిందంటే?
Karnataka Assembly Security : అయితే విధాన సౌధ వద్ద ఇటీవల జరిగిన భద్రతా వైఫల్యాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. ఈ క్రమంలోనే సోమవారం ఓ మహిళను తనిఖీ చేస్తుండగా ఆమె వద్ద కత్తి లభించడం కలకలం రేపింది. తూర్పు ద్వారం గుండా ఆ మహిళ లోపలికి వస్తుండగా.. అక్కడున్న సిబ్బంది ఆమెను తనిఖీ చేశారు. ఆమె బ్యాగ్‌ను స్కానింగ్‌ మెషిన్‌లోకి పంపగా అందులో ప్రమాదకర వస్తువులు ఉన్నట్లు సిగ్నల్‌ వచ్చింది. దీంతో సిబ్బంది అప్రమత్తమైంది. వెంటనే బ్యాగ్‌ను తనిఖీ చేయగా.. కత్తి బయటపడింది.

దీంతో పోలీసులు ఆ కత్తిని స్వాధీనం చేసుకుని ఆ మహిళను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆమెను పోలీసులు విచారిస్తున్నారు. అయితే ఆమె ఎవరనే వివరాలు ఇంకా తెలియరాలేదు. కాగా.. ఆమె అసెంబ్లీ ప్రాంగణంలోనే ఉన్న ఓ విభాగంలో పనిచేసే సిబ్బంది అని కొన్ని మీడియా కథనాలు పేర్కొన్నాయి.

ఎమ్యెల్యే స్థానంలో గుర్తుతెలియని వ్యక్తి..
Karnataka Assembly MLA Seat Issue : గత వారం బడ్జెట్‌ సమావేశాలసమయంలో ఓ వ్యక్తి దర్జాగా సభలో ప్రవేశించి ఎమ్మెల్యే స్థానంలో కూర్చున్నాడు. జేడీఎస్‌కు చెందిన ఎమ్మెల్యే కరియమ్మ కూర్చోవాల్సిన స్థానంలో గుర్తుతెలియని వ్యక్తి కూర్చున్నట్లు అదే పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే గుర్తించడం వల్ల అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని స్పీకర్‌ దృష్టికి తీసుకెళ్లడం వల్ల మార్షల్స్‌ అతడిని బయటకు తీసుకెళ్లారు.

అయితే గుర్తుతెలియని వ్యక్తిని 70 ఏళ్ల తిప్పే రుద్రప్పగా అధికారులు గుర్తించారు. విజిటర్స్‌ పాస్‌ సంపాదించిన రుద్రప్ప.. తాను ఎమ్మెల్యేనని చెప్పి లోపలకు ప్రవేశించాడని పోలీసులు తెలిపారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే అనుకుని మార్షల్స్‌ సైతం అడ్డుచెప్పకపోవడం వల్ల సభలోకి సులువుగా ప్రవేశించి ఎమ్మెల్యే స్థానంలో కూర్చున్నాడని వివరించారు. రుద్రప్పపై కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details