ఒడిశా బొలంగిర్కు చెందిన ఓ వ్యక్తి ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను మూడు నెలలకే అమ్మేశాడు. పనికోసం అని చెప్పి ఆమెను వేరే ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడే వదిలేసి వచ్చాడు. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు అతడ్ని అరెస్టు చేశారు. బాధితురాలిని కాపాడి కుటుంబసభ్యులకు అప్పగించారు.
ఏం జరిగిందంటే...
పెళ్లైన మూడు నెలలకే భార్యను అమ్మేసిన భర్త! ఒడిశా బెల్పారా పోలీస్ స్టేషన్ పరిధిలోని సులేకేలా గ్రామానికి చెందిన సరోజ్ రాణాకు బొలంగిర్కు చెందిన రేవతి(పేరు మార్చాము)తో ఫేస్బుక్లో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. అనంతరం ఇరు కుటుంబాలను ఒప్పించి సాంప్రదాయబద్దంగా పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన మూడు నెలల తర్వాత ఆర్థిక సమస్యలున్నాయని, ఇటుకల బట్టీలో పనిచేద్దామని చెప్పి భార్యను రాయ్‌పుర్ తీసుకెళ్లాడు సరోజ్. ఆ తర్వాత అక్కడి నుంచి ఆమెను రాజస్థాన్‌లోని ఓ గ్రామనికి తీసుకెళ్లాడు. అక్కడ ఓ వ్యక్తి ఇంట్లో వదిలేసి వచ్చాడు. ఆ తర్వాత రేవతి తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఆమె వేరే వ్యక్తితో పారిపోయిందని చెప్పాడు. అతడిపై అనుమానం వచ్చిన బాధితురాలి కుటుంబసభ్యులు బెల్పారా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు రేవతిని కాపాడి ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. సరోజ్‌ను అరెస్టు చేశారు.
ఇదీ చదవండి:బ్లాక్ ఫంగస్‌తో భార్య మృతి- నలుగురు పిల్లలతో కలిసి భర్త ఆత్మహత్య