Gujarat Road Accident Today : గుజరాత్.. అహ్మదాబాద్‌లోని ఇస్కాన్ వంతెనపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. 15 మంది గాయపడ్డారు. మృతుల్లో కానిస్టేబుల్, హోంగార్డు కూడా ఉన్నారు. సమాచారం అందుకున్న అధికారులు.. ఘటనాస్థలికి చేరుకున్నారు. గాయపడిన వారిని సోలా సివిల్ ఆస్పత్రికి తరలించారు.
కారు- డంపర్ ఢీ.. గుమిగూడిన ప్రజలపైకి దూసుకెళ్లిన 'జాగ్వార్'.. 9మంది మృతి
07:04 July 20
రెండు కార్లు ఢీ.. ప్రజలపైకి దూసుకెళ్లిన మరో వాహనం.. 9మంది మృతి
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం అర్ధరాత్రి ఎస్జీ హైవేపై ఈ ఘటన జరిగింది. తొలుత.. మహీంద్రా థార్ వాహనం, డంపర్ ఢీకొన్నాయి. ఆ ప్రమాదాన్ని చూసేందుకు అక్కడ దాదాపు 40 నుంచి 50 మంది ప్రజలు దాకా గుమిగూడారు. ఈ క్రమంలో కర్ణావతి క్లబ్ నుంచి దాదాపు గంటకు 160 కిలోమీటర్లకు పైగా వేగంతో దూసుకువచ్చిన జాగ్వార్ కారు.. వారిపైకి దూసుకెళ్లింది. దీంతో కొంతమంది దాదాపు 25 నుంచి 30 అడుగుల దూరంలోకి ఎగిరిపడ్డారు. ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. ఆ తర్వాత మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో విధుల్లో భాగంగా అక్కడే ఉన్న ఓ కానిస్టేబుల్, హోంగార్డు కూడా ఉన్నారు. మృతులను అక్షయ్ చావ్డా (బొటాడ్), కృనాల్ కొడియా (బొటాడ్), అమన్ కచ్చి (సురేంద్రనగర్), అర్మాన్ వడ్వానియా (సురేంద్రనగర్), నీరవ్ (అమ్డా), ధర్మేంద్ర సింగ్ (అహ్మదాబాద్- పోలీస్ కానిస్టేబుల్)గా గుర్తించారు.
ప్రమాదానికి కారణమైన జాగ్వార్ కారు డ్రైవర్ సహా 15 మందిని సోలా సివిల్ ఆసుపత్రికి తరలించారు. జాగ్వార్ కారులో ఓ బాలిక సహా నలుగురు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ఇందులో మిజన్ షేక్, నారన్ గుర్జర్లను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. ఈ ఘోర రోడ్డు ప్రమాదంపై సమాచారం అందుకున్న సెక్టార్-1 జేసీపీ నీరజ్‌కుమార్ బద్గుజార్.. సీనియర్ అధికారులతో కలిసి ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులందరినీ చికిత్స నిమిత్తం తరలించి ట్రాఫిక్‌ను మళ్లించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు ట్రాఫిక్ ఏసీపీ ఎస్జే మోదీ తెలిపారు. 12 మందిని ఆస్పత్రికి తరలించగా అందులో 9 మంది చనిపోయారని.. గాయపడిన వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని సోలా సివిల్ హాస్పిటల్ మెడికల్ ఆఫీసర్ కృపా పటేల్ తెలిపారు.
సీఎం సంతాపం.. రూ.4లక్షల ఎక్స్‌గ్రేషియా..
ఈ ఘోర ప్రమాదంపై గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ స్పందించారు. ఇస్కాన్ బ్రిడ్జి వద్ద బుధవారం రాత్రి జరిగిన ప్రమాదం చాలా బాధాకరమని ఆయన అన్నారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 చొప్పున ఎక్స్‌గ్రేషియా రూపంలో రాష్ట్ర ప్రభుత్వం అందించనుందని ట్వీట్ చేశారు.