Mother Spends Daughters Corpse: కర్ణాటక మండ్యలో హృదయవిదారక ఘటన జరిగింది. కూతురి మృతదేహంతో నాలుగు రోజులుగా ఇంట్లోనే ఉంది ఓ మహిళ. 30 ఏళ్ల రూప నాలుగు రోజుల క్రితం చనిపోయింది. ఈ విషయం బయట ఎవరికీ చెప్పని తల్లి నాగమ్మ అలాగే ఉంది. హళ్లాహళ్లి లేక్ ప్రాంతంలోని న్యూ తమిళ్ కాలనీలో సోమవారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
నాలుగు రోజులుగా అలాగే ఉండటం వల్ల.. మృతదేహం కుళ్లిపోయి దుర్వాసన వస్తోంది. చుట్టుపక్కలవారు గమనించి ఎలుక చనిపోయిందేమో అని భావించి వెతకడం మొదలుపెట్టారు. అప్పుడే నాగమ్మ, రూప కొద్దిరోజులుగా కనిపించట్లేదని వారికి తట్టింది. అదే సమయంలో మిక్సీ రిపేర్ చేయడానికి వచ్చిన ఓ వ్యక్తి.. నాగమ్మ ఇంటి తలుపులు బద్దలుకొట్టాడు. అక్కడి దృశ్యాలు చూసి అంతా షాకయ్యారు. లోపల కూతురి మృతదేహం పక్కనే నాగమ్మ ఉండటం చూసి భయంతో స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. వారి సాయంతో కుళ్లిన స్థితిలో ఉన్న బాడీని పోస్టుమార్టానికి తరలించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. రూప హోంగార్డ్‌గా పనిచేస్తోంది. ఓ కారణంతో.. కొన్నినెలల క్రితం ఆమె విధుల నుంచి సస్పెండ్ అయింది. అయితే ఇటీవలే మళ్లీ డ్యూటీలో చేరతానని లేఖ రాసినట్లు తెలుస్తోంది. పదేళ్ల క్రితం వివాహంకాగా.. కుటుంబసమస్యల కారణంగా ఐదేళ్లుగా భర్త, పిల్లలకు దూరంగా ఉంటోంది. అప్పటినుంచి తల్లితోనే నివసిస్తోంది రూప. కొద్దిరోజులుగా తల్లీకూతుళ్లు మద్యానికి బానిసయ్యారని స్థానికులు చెప్పారు. ఏదో కారణంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని వివరించారు. నాలుగు రోజులుగా బయటకు రాలేదని, ఏం జరిగిందో తెలియదని పోలీసులకు వెల్లడించారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన తర్వాతే అసలు విషయం తెలుస్తుందని స్పష్టం చేశారు పోలీసులు.