తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కలెక్టర్ బదిలీ.. వినూత్నంగా వీడ్కోలు.. వీడియో వైరల్ - IAS Krishna Teja News

Musical Farewell to IAS Krishna Teja: ఎవరైనా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి బదిలీ అయితే.. సాధారణంగా భోజనాలు, డ్యాన్స్ పార్టీలతో సెండాఫ్ పార్టీలు ఇస్తారు. ఇలాంటి ఘటనలు ఇప్పటికీ మనం ఎన్నో చూశాం. కానీ కేరళకు చెందిన ఓ వ్యక్తి అలెప్పీ జిల్లా కలెక్టర్ ట్రాన్స్​ఫర్ కావటంతో వినూత్నంగా వీడ్కోలు తెలిపాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇంతకీ అతను ఏం చేశాడు... కలెక్టర్​ ఎలా స్పందించారో మీరూ చూడండి..

alappuzha district collector Krishna Teja Musical farewell
అలప్పీ జిల్లా కలెక్టర్ కృష్ణ తేజ

By

Published : Mar 16, 2023, 8:08 PM IST

కలెక్టర్​కు వినూత్న వీడ్కోలు

Musical Farewell to IAS Krishna Teja: కేరళ రాష్ట్రంలోని అలెప్పీ జిల్లా కలెక్టర్ కృష్ణ తేజ త్రిసూర్​కు బదిలీ అయ్యారు. దీంతో ఆయన తమ జిల్లాను విడిచిపెట్టి వెళ్లి వెళ్తున్నందుకు ప్రముఖ ఫ్లూటిస్ట్ జోసీ.. సంగీతంతో వినూత్నంగా వీడ్కోలు తెలిపారు. అతడు కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి కృష్ణ తేజను పరామర్శించి వేణువు వాయిస్తూ.. వీడ్కోలు పలికారు. ఈ విధంగా బుధవారం ఫ్లూట్ వాయిస్తూ కలెక్టర్​పై ఆయనకున్న వీరాభిమానాన్ని ప్రదర్శించుకున్నాడు. జోసీ ఫ్లూట్ సంగీతాన్ని ఆస్వాదించిన కలెక్టర్ కృష్ణ తేజ.. అతడిని హత్తుకుని వినూత్న సెండాఫ్​కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

కలెక్టర్ అంకుల్:గుంటూరు జిల్లాకు చెందిన కలెక్టర్ కృష్ణ తేజ.. అలెప్పీ పిల్లలకు 'కలెక్టర్ అంకుల్'గా చేరువయ్యారు. 2018 వరదల సమయంలో అలెప్పీ సబ్ కలెక్టర్​గా ఉన్న ఆయన 'ఐ యామ్ ఫర్ అలెప్పీ' అనే ప్రాజెక్టుతో పాపులర్ అయ్యారు. అనంతరం ఆయన అలెప్పీ కలెక్టర్​గా బాధ్యతలు స్వీకరించారు. ఆయన కలెక్టర్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత జారీ అయిన తొలి ఉత్తర్వు పిల్లల కోసమే. భారీ వర్షాల నేపథ్యంలో ఆయన ఫేస్​బుక్ ద్వారా పాఠశాలలకు సెలవు ప్రకటించారు. దీనిపై ఆయనకు మలయాళంలో 'కలెక్టర్ మామన్' (కలెక్టర్ అంకుల్) అంటూ కామెంట్స్ వచ్చాయి. అయితే ఆ కామెంట్స్​పై తర్వాత రోజు స్పందించిన ఆయన పిల్లలకు తాను 'కలెక్టర్ అంకుల్' అని సంబోధించుకున్నారు. దీంతో అప్పటి నుంచి ఆయన 'కలెక్టర్ అంకుల్'గా పిల్లలకు మరింత చేరువయ్యారు.

వి ఆర్ ఫర్ అలెప్పీ:కొవిడ్ మహమ్మారి కల్లోలం రేపిన సమయంలో చాలా మంది పిల్లలు చదువుకు దూరమయ్యారు. ఆ సమయంలో కలెక్టర్ కృష్ణ తేజ ఎక్కడెక్కడ పిల్లలు చదువుకు దూరమై ఉన్నారో తెలుసుకున్నారు. అనంతరం వారు చదువుకు దూరం అయ్యేందుకు గల కారణాలను గుర్తించారు. అయితే వారిలో చాలామంది పిల్లలు తమ తల్లిదండ్రులలో ఒకరిని కోల్పోవడం, ఆర్థికంగా చితికిపోవటం వంటి సమస్యలతో సతమతం అవ్వడం ఆయన గమనించారు. దీంతో ఆయన 'ఐ యామ్ ఫర్ అలెప్పీ' అనే ప్రాజెక్టును రీడిజైన్ చేసి 'వి ఆర్ ఫర్ అలెప్పీ'గా మార్చారు. ఆ ప్రాజెక్టు ద్వారా చదువుకు దూరమైన పిల్లలందరి వివరాలు సేకరించి.. వారిని స్పాన్సర్ల దృష్టికి తీసుకుని వెళ్లారు. దీంతో ఆయన వినూత్న ఆలోచనతో స్ఫూర్తి పొందిన వేలాది మంది ఈ ప్రాజెక్టు నిధికి విరాళాలు అందించారు. వీటి ద్వారా జిల్లావ్యాప్తంగా పాఠశాల చదువులకు దూరమైన చాలామంది పిల్లలు బడి బాట పట్టారు. ఈ విధంగా ఆయన చదువుకు దూరమైన పిల్లలు తిరిగి పాఠశాలలకు వెళ్లి చదువుకునేలా చేసి వాళ్లకో దారి చూపించారు.

చిల్ట్రన్ ఫర్ అలెప్పీ:అలెప్పీ జిల్లాలో 3,600 పేద కుటుంబాల ఆకలిని తీర్చేందుకు కృష్ణ తేజ ప్రారంభించిన ప్రాజెక్ట్ 'చిల్ట్రన్ ఫర్ అలెప్పీ'. 'కలెక్టర్ అంకుల్'ను ఎంతగానో ఇష్టపడే పిల్లల సహకారంతో ఈ ప్రాజెక్టును ఆయన ఇటీవలే ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా గొప్పింటి పిల్లలు వాలంటరీగా తమకు వీలైనన్ని ఆహార ఉత్పత్తులను పాఠశాలలకు తీసుకుని వస్తారు. అనంతరం జిల్లా యంత్రాంగం వాటిని పేద విద్యార్థుల కుటుంబాలకు అందజేస్తారు.

ఇన్ని మంచి పనులు చేసిన కలెక్టర్ కృష్ణ తేజ బదిలీపై అక్కడి ప్రజలు కాస్త విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆయన మరో ఏడాది పాటు అయినా ఇక్కడే కలెక్టర్​గా కొనసాగాలని డిమాండ్ చేస్తూ.. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అలెప్పీ ప్రజలకు ఆయన పట్ల ఉన్న అభిమానం, ఆప్యాయతలను ఈ విధంగా వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చదవండి:

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details