తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కర్షకుల కష్టాలపై గళమెత్తిన చిన్నారి - Rahul Gandhi

సాగు చట్టాలపై ఆందోళన కొనసాగిస్తున్న రైతులకు మద్దతుగా నిలిచిన చిన్నారి పేరు.. దిల్లీ సరిహద్దుల్లో మారుమోగిపోతోంది. తన చిట్టిచిట్టి మాటలతో అందర్ని చైతన్యపరుస్తూ.. ఉద్యమిస్తున్న రైతుల్లో మరింత ఉత్సాహాన్ని నింపడమే ఇందుకు కారణం.

A girl supported to farmer protests
కర్షకుల కష్టాలపై గళమెత్తిన చిన్నారి

By

Published : Jan 10, 2021, 7:39 AM IST

దేశరాజధాని దిల్లీ సరిహద్దుల్లో అంకుఠిత దీక్షతో కొనసాగిస్తున్న రైతుల ఉద్యమం ఆ చిన్నారిని కదిలించింది. తోటి పిల్లలు గ్రామంలో ఆట పాటల్లో నిమగ్నమవ్వగా ఏడేళ్ల సనికా పటేల్‌ మాత్రం మధ్యప్రదేశ్‌లోని హర్దా జిల్లా నుంచి సింఘూలోని రైతుల దీక్షా శిబిరాల వద్దకు చేరుకుంది. 'నేను భూమి పుత్రిక'నంటూ గళమెత్తి కర్షకుల కష్టాలను హృద్యంగా అలతి అలతి పదాలతో ఆలపించింది. ఇప్పుడు సనికా పటేల్‌ పేరు దిల్లీలోని రైతుల శిబిరాల్లో మార్మోగుతోంది. తాను కూడా రైతు బిడ్డనేనని, కర్షకుల కష్టాలు తనకు తెలుసంటూ ఆ చిన్నారి చెబుతున్న మాటలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. మాజీ ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి రాసిన కవిత 'మిట్టీ కి బేటీ'ని చదువుతూ చైతన్యపరుస్తోంది. ఉద్యమిస్తున్న రైతుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది.

రైతులకు మద్దతుగా కచేరీ

సాగు చట్టాల రద్దు కోసం జరుగుతున్న ఉద్యమానికి మద్దతుగా పలువురు పంజాబ్‌ గాయకులు శనివారం టిక్రీ సరిహద్దు వద్ద పాటల కచేరీ నిర్వహించారు. హర్భజన్‌ మన్‌, జాజీ బి, రబ్బీ షేర్గిల్‌ తదితరులు గీతాలాపనతో ఉత్సాహాన్ని నింపారు. కన్వర్‌ గరేవాల్‌, హర్ఫ్‌ చీమా, నూర్‌ చాహల్‌ తదితరులూ గాత్ర కచేరీలో పాల్గొన్నారు. నినాదాలు, ప్రసంగాలతో రైతులను చైతన్యపరిచారు. బాలీవుడ్‌ నటి స్వర భాస్కర్‌ కూడా కార్యక్రమానికి హాజరయ్యారు.

రైతులకు కౌన్సెలింగ్‌

నలభై అయిదు రోజులుగా దిల్లీ సరిహద్దుల్లో ఉద్యమిస్తున్న రైతులు ఆరోగ్యపరమైన సమస్యలతో పాటు మానసిక వేదనకు గురవుతున్నారు. దీర్ఘకాలంపాటు కూర్చునే ఉండడం, తమ డిమాండ్లు పరిష్కారం కాలేదన్న ఆవేదన వారిని తీవ్రమైన ఒత్తిడికి, కుంగుబాటుకు గురిచేస్తున్నాయి. కొందరు ఆత్మహత్యలకూ పాల్పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రతికూల ఆలోచనల నుంచి రైతుల దృష్టిని మళ్లించేందుకు సింఘు సరిహద్దు వద్ద అమెరికాకు చెందిన 'యునైటెడ్‌ సిఖ్స్‌' సంస్థ మానసిక నిపుణులతో కౌన్సెలింగ్‌ ఇప్పిస్తోంది. ఇప్పటికే ఉచిత వైద్యంతో పాటు ఫిజియోథెరపి సేవలను పలు సంస్థలు అందిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపున ఖల్సా ఎయిడ్‌ ఇండియా సంస్థ టిక్రీ సరిహద్దు వద్ద రైతుల కోసం 800 పడకలతో వసతి కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఈ సంస్థ సింఘు సరిహద్దు వద్ద 600 పడకల వసతిని కల్పించింది. రాత్రి సమయాల్లో రైతులు ఇక్కడ నిద్రిస్తారు.

మరో రైతు ఆత్మహత్య

సింఘు సరిహద్దు వద్ద ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొంటున్న అమరీందర్‌ సింగ్‌ (40) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పంజాబ్‌లోని ఫతేగఢ్‌ సాహెబ్‌ జిల్లాకు చెందిన ఈ రైతు శనివారం గుర్తుతెలియని విష పదార్థం తీసుకొన్నాడని పోలీసులు తెలిపారు.

మోదీ రాజీనామా చేయాలి: కాంగ్రెస్‌

సాగు చట్టాలను రద్దు చేయాలని కోరుతున్న రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని కేంద్ర ప్రభుత్వం ఎందుకు చెబుతోందని కాంగ్రెస్‌ పార్టీ ప్రశ్నించింది. ఆ చట్టాలను ఉపసంహరించుకోలేకపోతే ప్రధాని మోదీ తన పదవికి రాజీనామా చేయాలని ఆ పార్టీ ప్రధాన అధికార ప్రతినిధి రణదీప్‌ సుర్జేవాలా డిమాండ్‌ చేశారు. ఈ నెల 15వ తేదీని రైతుల హక్కుల దినోత్సవం (కిసాన్‌ అధికార్‌ దివస్‌)గా పాటించనున్నట్లు ప్రకటించారు.

ఇదీ చూడండి:'సాగు చట్టాలు మేలే- మమ్మల్ని కక్షిదారులుగా చేర్చండి'

ABOUT THE AUTHOR

...view details