ఎన్నికల్లో నేతలు గెలుపు కోసం ఎంతో ఖర్చు చేసి.. ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు అహర్నిశలు శ్రమిస్తుంటారు. హరియాణా రోహ్‌తక్ జిల్లాలో చిరి గ్రామానికి చెందిన ధరంపాల్ అనే అభ్యర్థి.. పంచాయతీ ఎన్నికల్లో గెలిచేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు. కానీ ఓటమి తప్పలేదు. కేవలం 66 ఓట్ల తేడాతో ఆయన ఓటమి పాలయ్యారు. ఇంతకుముందే లఖన్ మజ్రా బ్లాక్ సమితికి ఆయన ఛైర్మన్‌గా పని చేశారు. ధరంపాల్ తండ్రి, తాతలు కూడా ఇంతకుముందు సర్పంచ్‌గా పని చేశారు. దీంతో ఓడిపోయిన ధరంపాల్‌కు ప్రజల్లో సానుభూతి మరింత ఎక్కువైంది.
ఎన్నికల్లో ఓడిపోయిన వ్యక్తికి రూ.2.11 కోట్ల విలువైన కానుకలు - ఎన్నికల్లో ఓటమి పాలైన ధరంపాల్
ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులపై ప్రజలకు సానుభూతి ఉండటం సర్వ సాధారణం. అయితే హరియాణాలోని రోహ్‌తక్ జిల్లా ప్రజల సానుభూతి.. ఆకాశాన్ని తాకింది. అంబరాన్ని అంటే సంబరాలతో ఓడిపోయిన అభ్యర్థికి అట్టహాసంగా.. కోట్లు విలువ చేసే కానుకలు ఇచ్చి ఓదార్చారు. ఓడిపోయినా గెలిచినా.. మీ వెంటే మేమున్నామని తమకున్న అభిమానాన్ని చాటి చెప్పారు.
ఇంట్లో మనిషిలా తిరిగే ఆయనకు ఏదైనా చేయాలని గ్రామస్థులు, పెద్దలు నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా విరాళాలు సమీకరించుకుని దాదాపు రూ.2.11 కోట్ల నగదుతో పాటు ఓ ఎస్యూవీ వాహనాన్ని కొనుగోలు చేశారు. ఓ భారీ సమావేశం నిర్వహించి ధరంపాల్‌కు ఆ వాహనాన్ని బహూకరించారు. ఆయనకు తలపాగాను అలంకరించి.. పూలమాలలతో సత్కరించారు.
ప్రజలు తనపై చూపిన ఎల్లలు లేని అభిమానానికి.. ధరంపాల్ కూడా ఆశ్చర్యపోయారు. ప్రజల్లో తనకు అభిమానం ఎన్నికలు నిర్దేశించలేవని.. గెలుపోటములు రాజకీయాల్లో సహజమని ఆయన అన్నారు. జీవితాంతం తమ ప్రజలకు రుణపడి ఉంటానని తెలిపారు. ఎన్నికల్లో.. గెలుపొందిన అభ్యర్థిపై కూడా తనకు ఎలాంటి అసూయ, ద్వేషాలు లేవనీ.. ప్రజల అభ్యున్నతి కోసం పని చేసే ఎవరికైనా.. తన వంతు సహకారం చేస్తానన్నారు.