మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో దారుణం జరిగింది. అనారోగ్యంతో బాధపడుతున్న బాలికకు దెయ్యం పట్టిందని కర్రతో కొట్టి చంపారు ఆమె తల్లిదండ్రులు.
పోలీసుల వివరాల ప్రకారం.. నగరంలోని సుభాష్ నగర్ ప్రాంతంలో సిద్ధార్థ్ చిమనే అనే వ్యక్తి తన కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. అయితే సిద్ధార్థ్ ఆరేళ్ల కుమార్తె కొద్దిరోజుల క్రితం అనారోగ్యం బారినపడింది. ఎన్ని మందులు వేసినా కోలుకోవట్లేదు. అయితే ఆమె తల్లిదండ్రులు.. చిన్నారికి దెయ్యం పట్టిందని భావించారు. స్థానికంగా ఉన్న ఓ బాబా దగ్గరికి తీసుకెళ్లి ఏవో పూజలు చేశారు. అనంతరం ఇంటికి వచ్చాక కూడా రకరకాల పూజలు నిర్వహించారు. అయినా ఎటువంటి లాభం లేకపోవడం వల్ల సిద్ధార్థ్ దంపతులతోపాటు మరో మహిళ కలిసి.. భూతవైద్యం పేరుతో చిన్నారిని కర్రతో గట్టిగా కొట్టారు. దీంతో బాలిక అక్కడిక్కడే కుప్పకూలింది.
వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా.. ఆమె అప్పటికే మరణించిందని వైద్యులు తెలిపారు. వెంటనే బాలిక తల్లిదండ్రులు.. మృతదేహాన్ని ఆసుపత్రిలో వదిలేసి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఆసుపత్రికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. బాలిక మృతికి కారణమైన ముగ్గురిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.
విద్యార్థిని రేప్ కేసులో సోషల్ మీడియా ఆర్టిస్ట్ అరెస్ట్
కేరళ.. తిరువనంతపురంలోని ఓ లాడ్జిలో నెలరోజుల క్రితం కాలేజీ విద్యార్థినిపై జరిగిన అత్యాచారం కేసులో ప్రముఖ సోషల్ మీడియా ఆర్టిస్ట్‌ను అరెస్టు చేశారు పోలీసులు. అదే రోజు కోర్టులో హజరుపరచి.. 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీకి తరలించామని చెప్పారు.