పోలీసులపై వరుస దాడులు వెలుగులోకి వస్తున్నాయి. హరియాణాలో డీఎస్పీ, ఝార్ఖండ్‌లో మహిళా ఎస్సై హత్యలు జరిగిన కొన్ని గంటలకే మరో పోలీసు అదే తరహాలో ప్రాణాలు కోల్పోయారు. అనుమానాస్పదంగా ఉన్న వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించిన పోలీస్ కానిస్టేబుల్‌పై నుంచి డ్రైవర్ ట్రక్కును పోనిచ్చాడు. అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. చికిత్స పొందుతూ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన గుజరాత్‌లోని బోర్సాద్‌లో అర్ధరాత్రి 1 గంటకు జరిగిందని పోలీసులు వెల్లడించారు. మృతిచెందిన వ్యక్తిని కరణ్‌సింగ్ రాజ్‌గా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని గుర్తించామని త్వరలోనే అతనిడి అరెస్ట్ చేస్తామని తెలిపారు.
హరియాణాలో దారుణం..: నుహ్‌లో అక్రమ మైనింగ్‌పై విచారణకు వెళ్లిన మేవాత్ డీఎస్పీ సురేంద్ర సింగ్ బిష్ణోయ్ మంగళవారం హత్యకు గురయ్యారు. లారీతో ఢీకొట్టి బిష్ణోయ్‌ను హత్య చేసిన నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకున్నారు. ఘటన జరిగిన గంటల వ్యవధిలో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టుకు ముందు జరిగిన ఎన్కౌంటర్లో నిందితుడికి బుల్లెట్ గాయమైంది. అతడి కాలిలో తూటా దిగిందని హరియాణా డీజీపీ పీకే అగర్వాల్ తెలిపారు. ఈ హత్యకు సంబంధం ఉన్న మిగతా వారిని కూడా అరెస్ట్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.