మట్టిలో మాణిక్యం, చదువుల తల్లి, విద్యా కుసుమం అనే పేర్లు.. ఈ విద్యార్థినికి సరిగ్గా సరిపోతాయి. రైతు కుటుంబంలో పుట్టి చదువులో అద్భుత ప్రతిభతో అందరి మన్ననలు పొందుతోంది. అంతే కాదండోయ్.. అత్యంత కష్టమైన కెమెస్ట్రీ విభాగంలో యూనివర్సిటీలోనే అత్యధికంగా 20 బంగారు పతకాలు సాధించి ఔరా అనిపించింది. ఆమే చిత్ర నారయణ్ హెగ్డే.
కర్ణాటక, ఉత్తర కన్నడ జిల్లా సిర్సీ తాలూకలోని షీగేహళ్లి గ్రామానికి చెందిన విద్యార్థిని చిత్ర నారాయణ్ హెగ్డే.. మైసూర్ విశ్వవిద్యాలయంలోని కెమెస్ట్రీ విభాగంలో ఎంఎస్సీ(మాస్టర్ ఆఫ్ సైన్స్) చదువుతోంది. ఈ ఏడాది యూనివర్సిటీలో అత్యధిక మెడల్స్ సాధించి తొలి స్థానంలో నిలిచింది. మంగళవారం జరిగిన మైసూర్ యూనివర్సిటీ 101వ స్నాతకోత్సవంలో 20 బంగారు పతకాలు సాధించింది. రాష్ట్ర గవర్నర్ థావర్ చంద్ గెహ్లోత్ చేతుల మీదగా పతకాలు అందుకుంది.
"1వ తరగతి నుంచి 10 వరకు కన్నడలో చదివాను. ఆ తర్వాత సైన్స్‌ను ప్రధాన సబ్జెక్ట్‌గా ఎంచుకున్నా. బీఎస్సీ వరకు కొంచె కష్టంగా అనిపించింది. కానీ, నాకు కెమెస్ట్రీ అంటే చాలా ఇష్టం. ఈ మెడల్స్ సాధించటం చాలా సంతోషంగా ఉంది. ఈ పతకాలను నా తల్లిదండ్రులు, ప్రొఫెసర్స్, నాకు మద్దతుగా నిలిచిన వారందరికీ అంకితం చేస్తున్నా. భవిష్యత్తులో మెడిసినల్ కెమెస్ట్రీలో పరిశోధనలు చేయాలనుకుంటున్నా. "