సాగు చట్టాలపై నెలకొన్న ప్రతిష్టంభన పరిష్కారానికి ఏర్పాటు చేసిన కమిటీలోని ముగ్గురు సభ్యులను తొలగించాలని కోరుతూ.. భారతీయ కిసాన్ యూనియన్ లోక్‌శక్తి, సుప్రీంకోర్టును ఆశ్రయించింది. వారందరూ వ్యవసాయ చట్టాలకు మద్దతుగా ఉన్నారని ఆరోపించింది. దీని వల్ల సహజ న్యాయ సూత్రానికి తావుండదని పేర్కొంది. ఇరువర్గాలకు అనుకూలంగా పని చేసే వ్యక్తులను నియమించాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించింది.
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న 40 రైతు సంఘాలలో భారతీయ కిసాన్ యూనియన్ ఒకటి. కాగా, ఈ చట్టాల అమలును నిలిపివేస్తూ నలుగురు సభ్యులతో కూడిన కమిటీని దేశ సర్వోన్నత న్యాయస్థానం నియమించింది. భూపిందర్ సింగ్ మన్, డా.ప్రమోద్ కుమార్ జోషి, అశోక్ గులాటి, అనిల్ ఘన్వంత్లను సభ్యులుగా చేర్చింది. కమిటీలో నుంచి మన్ ఇప్పటికే తప్పుకోగా.. మిగిలిన వారినీ తొలగించాలని భారతీయ కిసాన్ యూనియన్ తాజాగా కోరింది.