తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రభుత్వం దిగిరాకపోతే పార్లమెంట్‌ ముట్టడే: రైతులు

కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేస్తున్న ఆందోళనలు ఉద్ధృతంగా సాగుతున్నాయి. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సినందేనని పట్టుబడుతున్నారు రైతులు. శనివారం జరగనున్న చర్చల్లో ఎలాంటి సానుకూల ఫలితం రాకపోతే పార్లమెంట్​ను ముట్టడిస్తామని తేల్చి చెబుతున్నారు. ఇప్పటికే ఈనెల 8న భారత్​ బంద్​ కూడా చేపట్టాలని నిర్ణయించారు.

farmers protest
రైతులు చేస్తోన్న ఆందోళనలు ఉద్ధృతం

By

Published : Dec 5, 2020, 11:27 AM IST

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్న రైతులతో కేంద్రప్రభుత్వం శనివారం మరోసారి సంప్రదింపులు జరపనుంది. ఇప్పటికే రెండుసార్లు చర్చలు జరగ్గా.. కేంద్రం చేసిన ప్రతిపాదనలను రైతులు తిరస్కరించంతో అవి కొలిక్కిరాలేదు. దీంతో అన్నదాతలతో మరో విడత చర్చలకు కేంద్రం సిద్ధమైంది. అయితే ఇప్పటికైనా తమ సమస్యలను పరిష్కరించాలని, నూతన చట్టాలను వెనక్కి తీసుకోవాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. వ్యవసాయ చట్టాలపై ప్రభుత్వం దిగిరాకపోతే పార్లమెంట్‌ను ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే 8వ తేదీన భారత్‌ బంద్‌ కూడా చేపట్టాలని రైతన్నలు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో నేటి భేటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

మరోవైపు దిల్లీ శివారుల్లో అన్నదాతల ఆందోళన పదో రోజుకు చేరింది. దిల్లీ-నోయిడాను కలిపే చిల్లా సరిహద్దులో వేలాది మంది రైతులు బైఠాయించి నిరసన సాగిస్తున్నారు. 'నేటి చర్చల్లో సానుకూల ఫలితం రాకపోతే పార్లమెంట్‌ను ముట్టడిస్తాం' అని రైతన్నలు కరాఖండీగా చెబుతున్నారు. అన్నదాతల ఆందోళన నేపథ్యంలో చిల్లా రహదారిపై ట్రాఫిక్‌ను నిలిపివేశారు. అటు దిల్లీ-యూపీని కలిపే 24వ జాతీయరహదారిపై ఉన్న ఘజియాపూర్‌-ఘజియాబాద్‌ సరిహద్దును కూడా మూసేశారు. దిల్లీ-హరియాణా మార్గంలోని టిక్రి, సింఘు సరిహద్దులోనూ వేలాది మంది అన్నదాతల ఆందోళన కొనసాగుతోంది. రహదారిపైనే వంటావార్పు చేసుకుంటూ, ట్రాక్టర్లనే గుడారాలుగా మార్చుకుని గత తొమ్మిది రోజులుగా ఈ సరిహద్దులో రైతులు నిరసన సాగిస్తున్నారు.

అన్నదాతలకు విదేశాల మద్దతు

కాగా.. రైతులు చేస్తున్న ఆందోళనకు దేశవ్యాప్తంగానే గాక, విదేశాల నుంచి కూడా మద్దతు లభిస్తోంది. ఇప్పటికే కెనడా ప్రధాని, ఆ దేశ నేతలు అన్నదాతలకు సంఘీభావం తెలపగా.. తాజాగా బ్రిటన్‌ ఎంపీలు కూడా మద్దతు ప్రకటించారు. అయితే రైతుల ఆందోళనపై విదేశీయుల జోక్యాన్ని భారత్‌ తీవ్రంగా ఖండిస్తోంది. దేశ అంతర్గత వ్యవహారాల్లో ఇతరుల జోక్యం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది.

ఇదీ చూడండి: రైతులతో చర్చకు ముందు ప్రధాని కీలక భేటీ

ABOUT THE AUTHOR

...view details