కర్ణాటకలో ఓ శునకం తన యజమాని ప్రాణాలను కాపాడింది. శివమొగ్గ జిల్లాకు సమీపంలో హోసానగర్ తాలూకాలో అడవి మధ్యలో సుదురు అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో శేఖరప్ప(55) అనే వ్యక్తి రోజూ ఉదయం అడవికి వెళ్లి కట్టెలు తెచ్చి అమ్ముకుంటుండేవాడు. మధ్యాహ్నం సమయంలో మాత్రం ఓ క్యాంటీన్లో పని చేస్తుండేవాడు. ఎప్పటిలాగే శనివారం కూడా కట్టెలు తీసుకురావటానికి శేఖరప్ప అడవికి వెళ్లాడు. అయితే మధ్యాహ్నం అయినా సరే ఆ రోజు ఇంటికి రాలేదు.
ఇంట్లోవాళ్లు అతని దగ్గర ఉన్న మొబైల్కు కాల్ చేయగా ఫోన్ కనెక్టవ్వలేదు. దీంతో ఇంటి వద్ద ఎదురుచూస్తున్న శేఖరప్ప భార్య, కుమార్తె ఆందోళన చెంది సమాచారాన్ని బంధువులకు, ఇరుగు పొరుగువారికి చేరవేశారు. వెంటనే గ్రామస్థులంతా శేఖరప్పను వెతికేందుకు అడవికి వెళ్లారు. కాని వారు ఎంత వెతికినా శేఖరప్ప జాడ మాత్రం తెలియలేదు. వీరితోపాటు వచ్చిన శేఖరప్ప పెంపుడు కుక్క మాత్రం అందరూ ఒక వైపునకు వెళ్తుంటే తను మాత్రం వేరే దిశగా వెళ్లింది. చివరకు ఆ శునకం తన యజమానిని కనిపెట్టి, అరిచింది. కుక్క అరుపులతో గ్రామస్థులంతా వెళ్లి చూడగా శేఖరప్ప అపస్మారక స్థితిలో ఉన్నాడు. వెంటనే అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందిన తరువాత శేఖరప్ప కోలుకున్నాడు. దీంతో గ్రామస్థులంతా కుక్కను ప్రశంసిస్తున్నారు.