Old couple reunited: యవ్వనంలో విడిపోయిన ఓ జంట.. వృద్ధాప్యంలో మళ్లీ ఒక్కటైంది. 52 ఏళ్ల క్రితం విడాకులు తీసుకున్న ఈ దంపతులు ఇప్పుడు మళ్లీ కలిసి జీవించాలనుకుంటున్నారు. కర్ణాటకలోని ధార్వాడ్ జిల్లాలో నిర్వహించిన లోక్ అదాలత్ కార్యక్రమంలో బాసప్ప అగడి(85), కల్లవ అగడి(80) జంటను జడ్జిలు మళ్లీ కలిపారు. విడిపోవాలనుకున్న మొత్తం 38 జంటలను తిరిగి ఒక్కటి చేశారు.
బాసప్ప, కల్లవ దంపతులు 52 ఏళ్ల క్రితం పెళ్లైన కొద్ది సంవత్సరాలకే విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి బాసప్ప.. కల్లవకు ప్రతినెల భరణం చెల్లిస్తూ వస్తున్నారు. అయితే కొద్ది నెలలుగా ఆయన భరణం ఇవ్వడం ఆపేశారు. దీంతో కల్లవ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసును తీవ్రంగా తీసుకున్న న్యాయస్థానం.. లోక్ అదాలత్లో పరిష్కారించాలనుకుంది. అయితే న్యాయమూర్తి ఈ వృద్ధ జంటను చూసి షాక్ అయ్యారు. ఇద్దరి మధ్య రాజీ కుదిర్చారు. దీంతో మళ్లీ కలిసి జీవించేందుకు వారు ఒప్పుకున్నారు.