Kerala Couple Death News: సొంతిల్లు కట్టుకోవాలనే కలను సాకారం చేసుకుంది ఆ జంట. కొత్తగా ఇంటిని నిర్మించుకుంది. ఘనంగా గృహప్రవేశం చేసింది. కానీ ఆ తర్వాత రెండు రోజులకే.. ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించి దంపతులిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. తీవ్ర గాయాలపాలైన వారి కుమార్తె ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతోంది. కేరళ ఇడుక్కి జిల్లాలోని పుత్తడి గ్రామంలో సోమవారం ఉదయం 2 గంటల సమయంలో జరిగింది ఈ హృదయవిదారక ఘటన.
చనిపోయిన దంపతులిద్దరినీ రవీంద్రన్(50), ఉష(45)గా గుర్తించారు పోలీసులు. వీరిది పేద కుటుంబం. ఆర్థికంగా వెనుకపడిన వారికి లైఫ్ ప్రాజెక్టు పేరుతో సొంతిల్లు కట్టుకునేందుకు సాయం చేస్తోంది కేరళ ప్రభుత్వం. ఇందులో భాగంగానే వారి కొత్త ఇంటి నిర్మాణం పూర్తయింది. అందులోకి వెళ్లిన రెండు రోజులకే ప్రమాదం జరిగింది. అయితే ప్రమాదం జరిగిన తర్వాత రవీంద్రన్, ఉషల కూతురు శ్రీ ధన్య ఇంటిపైనుంచి బయటకు దూకింది. భయంతో ఏడుస్తూ గట్టిగా అరవడం చూసి చుట్టుపక్కల వచ్చాక ప్రమాదం విషయం తెలిసింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపు చేశారు. అనంతరం శ్రీ ధన్య, ఆమె తల్లిదండ్రులకు ఆస్పత్రికి తరలించారు. అయితే దంపతులిద్దరూ అప్పటికే చనిపోయిటన్లు వైద్యులు ప్రకటించారు. కాలిన గాయాలైన కూతురికి మెరుగైన చికిత్స కోసం ఇడుక్కి ఆస్పత్రి నుంచి కోట్టాయం మెడికల్ కాలేజీకి తీసుకెళ్లారు. అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.