సామాజిక మాధ్యమం.. డిజిటల్ యుగంలో ఇది ప్రజల జీవితాల్లో ఓ భాగంగా మారింది. సామాజిక మాధ్యమాల ద్వారా తమకున్న ప్రతిభను చాటిచెబుతూ అనేకమంది తమకంటూ ప్రత్యేక గుర్తింపును పొందుతున్నారు. తమిళనాడుకు చెందిన 'చెన్నై వ్లోగర్' దీపన్ చక్రవర్తి కూడా ఈ కోవకు చెందిన వ్యక్తే. తన యూట్యూబ్ ఛానెల్‌తో మంచి పేరు సంపాదించుకున్న దీపన్.. ఇప్పుడు ఓ అడుగు ముందుకేసి రానున్న ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. అయితే తనకు గుర్తింపు తెచ్చి పెట్టిన సామాజిక మాధ్యమాలనే ఉపయోగించుకుంటూ.. యువ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.
పాత్రికేయం టు రాజకీయం
నమక్కల్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న దీపన్.. ఎన్నికల గుర్తు లారీ. వాస్తవానికి దీపన్.. తన ప్రస్థానాన్ని రిపోర్టర్‌గా ప్రారంభించారు. 'చెన్నై వ్లోగర్ దీపన్' పేరుతో.. రోజూ యూట్యూబ్‌లో వీడియోలు పోస్ట్ చేస్తూ.. తమిళ యువతకు దగ్గరయ్యారు. ఇప్పుడు వ్లోగర్‌గా తనకున్న అనుభవాన్ని, యువతలో తనకున్న క్రేజ్‌ను ఎన్నికల ప్రచారంలోనూ వినియోగించుకోవాలని ప్రయత్నిస్తున్నారు.
అన్నీ వీడియోలతోనే..
నామినేషన్ దాఖలు చేయటం, ఎలక్షన్ గుర్తును ప్రచారం చేయడం.. ఇలా ప్రతి అంశాన్ని వీడియో తీసి తన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నారు దీపన్. యువతకు తన రాజకీయ అనుభూతిని వివరించే ప్రయత్నం చేస్తున్నారు.
'మార్పు కోసం వెతుక్కుంటూ వెళ్లటం కాదు.. మార్పు మనలోనే మొదలు కావాల'ని అంటున్నారు దీపన్.