ఊరికి, ఊళ్లో జనాలకు ఎలాంటి సమస్య వచ్చినా ముందు నిలబడేది.. గ్రామ పెద్దలే. తరతరాలను చూసిన కళ్లతో.. మంచీచెడూ చూసిన అపార అనుభవంతో ఒకే ఒక్క మాటతో ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపుతుంటారు. ఆధునిక కాలంలోనూ దురాచారాలను ప్రజలపై రుద్దుతూ.. ఆటవికుల్లా ప్రవర్తించే పెద్దమనుషులే ఊళ్లో ఉంటే ఎన్నో సమస్యలు వస్తుంటాయి. ఇందుకు నిదర్శనంగా నిలిచే ఓ ఘటన ములుగు జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఓ వ్యక్తి అంటగట్టిన వివాహేతర బంధాన్ని నిరూపించుకోవాలంటూ అమాయకుడికి అగ్నిపరీక్ష పెట్టి బతికుండగానే గ్రామపెద్దలు నరకం చూపించారు. ములుగు మండలం బరిగెలపల్లి గ్రామానికి చెందిన గంగాధర్.. ఊళ్లలో వస్తువులు విక్రయిస్తూ జీవనం సాగిస్తుంటాడు. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆరోపిస్తూ ఇటీవల ఓ వ్యక్తి గంగాధర్‌పై ఆరోపణలు చేశాడు. ఈ వివాదంపై రంగప్రవేశం చేసిన గ్రామంలోని పెద్దమనుషులు.. నిజం నిరూపించుకోవాలని గంగాధర్‌కు హుకుం జారీచేశారు.
మంటల్లో గడ్డపారను ఎర్రగా కాల్చి దానిని పట్టుకోవాలని.. చేతులు కాలితే తప్పు చేసినట్లని, అందుకు 4లక్షల రూపాయలు ఇవ్వాలని తెల్చిచెప్పారు. చేతులు కాలని పక్షంలో తప్పుచేయనట్లేనని.. అందుకు ఆరోపణలు చేసిన వ్యక్తి 4లక్షల రూపాయలు ఇస్తారని చెప్పారు. ఓ వైపు పెద్దమనుషులు ఒత్తిడి.. మరోవైపు తనపై పడిన నిందను భరించలేని గంగాధర్ ఇక ఎర్రగా కాలిన గడ్డపలుగును పట్టుకునేందుకు సిద్ధమయ్యాడు.
గత నెల 25న గ్రామ సమీపంలోని లక్నవరం సరస్సు వద్దకు తీసుకువెళ్లి మంటలు పెట్టారు. అందులో గడ్డపలుగును ఉంచి.. ఎర్రగా కాల్చారు. చెరువులో స్నానం చేసిన గంగాధర్.. తడి దుస్తులతో పెద్దమనుషులు సమక్షంలో మంటల్లో కాలుతున్న గడ్డపారను చేతులతో బయటికి తీశాడు. త్వరగా తీసి బయట పడేయటంతో గంగాధర్ చేతులకు అంతగా గాయాలు కాలేదు.