అది 1971.. భారత్-పాకిస్థాన్ మధ్య 13 రోజుల పాటు భీకర యుద్ధం జరిగింది. పాకిస్థాన్ కబంధ హస్తాల్లో నలిగిపోతున్న బంగ్లాదేశ్‌కు విముక్తి కలిగించేందుకు దాయాది దేశంతో తీవ్రంగా పోరాడింది భారత్. చివరకు ఆ పోరులో నెగ్గిన ఇండియా.. బంగ్లాకు స్వాతంత్ర్యాన్ని అందించింది. అయితే ఓడిపోయిన పాక్ మాత్రం అప్పట్నుంచి తన దుర్నీతి ప్రదర్శిస్తూ.. ఇప్పటికీ సరిహద్దుల్లో స్నేహపూర్వక వాతావరణాన్ని దెబ్బతీస్తోంది. ఆ యుద్ధం తర్వాత ఎన్నోసార్లు ఇరుదేశాల మధ్య శాంతి చర్చలు జరిగాయి. ఆ క్రమంలో ఇరుదేశాల మధ్య 1972లో జరిగిన సిమ్లా ఒప్పందం చాలా కీలకం. అప్పటినుంచే ఇరుదేశాల సరిహద్దుల మధ్య ఓ 'లక్ష్మణ రేఖ' ఏర్పాటైంది. అదే నియంత్రణ రేఖ.
కనిపించని గీత..
నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) అనేది ప్రత్యక్షంగా కనిపించదు. ఇదొక ఊహాజనిత రేఖ. దీన్ని తొలిసారి 1947-48 మధ్య గుర్తించారు. అయితే ఆ సమయంలోనే ఇరుదేశాల మధ్య వివాదాలు మొదలయ్యాయి. నెమ్మదిగా చినికి చినికి 1948లో ఘర్షణలకు దారితీసింది. అనంతర కాలంలో అదే రేఖకు ఇరువైపులా భారత, పాకిస్థాన్ భద్రతా బలగాలు గస్తీ ప్రారంభించాయి. 1972లో సుచెత్ఘర్ ఒప్పందం జరిగింది. దాని ప్రకారం ఆ రేఖను.. కాల్పుల విరమణ రేఖ(సీఎఫ్ఎల్)గా పిలవటం ప్రారంభించారు. ఇది అంతర్జాతీయ సరిహద్దుకు(ఐబీ) పూర్తి భిన్నంగా ఉంటుంది.
'సిమ్లా'తో మార్చేశారు...
1972లోనే జరిగిన సిమ్లా ఒప్పందం సమయంలో అంతకుముందు ఉండే కాల్పుల విరమణ రేఖ(సీఎఫ్ఎల్)ను.. జమ్ముకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ(ఎల్ఓసీ)తో భర్తీ చేశారు. ఈ రెండింటి మధ్య సారూప్యత ఉన్నప్పటికీ.. భారత్-పాకిస్థాన్ మధ్య సరిహద్దుల్లో చిన్నపాటి మార్పులు చేర్పులు జరిగాయి. అక్రమంగా సరిహద్దుల్లోకి ప్రవేశించడం, స్మగ్లింగ్, అక్రమ రవాణా, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు ఈ ప్రాంతంలో పోలీసు బలగాలు ఉంటాయి. అయితే నియంత్రణ రేఖ పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంటుంది. ఇక్కడ ఇరు దేశాల సైన్యాలు గస్తీ నిర్వహిస్తుంటాయి. నియంత్రణ రేఖ వద్ద పరిస్థితులను యునైటెడ్ నేషనల్ అబ్జర్వర్స్ గ్రూప్(యూఎన్‌ఎమ్‌ఓజీఐపీ) పర్యవేక్షిస్తూ ఉంటుంది.
కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు..
- 1972లో నియంత్రణ రేఖను నిర్ధరించిన అనంతరం సరిహద్దుల్లో దాదాపు 10ఏళ్ల పాటు ఎటువంటి ఉద్రిక్తతలు జరగలేదు.
- 1980 నుంచి యుద్ధ ట్యాంకులతో గస్తీ (సీఎఫ్వీ) జోరందుకోగా.. 1990లో కశ్మీర్లో తిరుగుబాటు తారాస్థాయికి చేరుకునే నాటికి ఇరుదేశాలు పూర్తి బలగాలను మొహరించాయి.
- 2001లో భారత్ తన సరిహద్దు ప్రాంతంలో కంచె నిర్మించడం ప్రారంభించిన తర్వాత నియంత్రణ రేఖ వద్ద కాల్పులు తీవ్రతరం అయ్యాయి.
- 2003 తర్వాత ఇరుదేశాలు యుద్ధ ట్యాంకులను దాదాపు 5 ఏళ్లపాటు నిషేధించాయి. ఈ దేశాల మధ్య ఆ సమయంలో జరిగిన చర్చలు మంచి ఫలితాలను ఇచ్చాయి. అయితే ముంబయిలో 2008 ఉగ్రదాడుల తర్వాత శాంతి చర్చలకు తావు లేకుండా పోయాయి. క్రమంగా సరిహద్దుల్లో యుద్ధట్యాంకుల అలజడి పెరిగింది.
- 2013లో అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖ వద్ద ఉల్లంఘనలు ఎక్కువయ్యాయి. ప్రతి ఏడాది అవి గణనీయంగా పెరుగుతున్నాయి.
- 2017లో భారత్ 1,970 సార్లు ఉల్లంఘనలకు పాల్పడిందని పాకిస్థాన్ ఆరోపించింది. 2018లో పాకిస్థాన్ 936 సార్లు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచిందని భారత్ ఆరోపించింది. ఆనాటికి 15 ఏళ్లలోనే ఆల్‌టైమ్ రికార్డది.
- 2018 మే నెలలో జమ్ముకశ్మీర్‌లో.. భారత్ నాన్-ఇనీషియేషన్ ఆఫ్ కాంబాట్ ఆపరేషన్లను ప్రకటించింది. దీన్నే రంజాన్ కాల్పుల విరమణ అంటారు. ఇది 2003లో జరిగిన కాల్పుల విరమణ ఒప్పందానికి కొనసాగింపు. అయితే కాలక్రమేణ ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు దెబ్బతిని.. 2019, 2020లో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి.
2003 కాల్పుల విరమణ ఒప్పందం..
- 2003, నవంబర్ 25-26 తేదీల్లో ఇరుదేశాల మిలిటరీ జనరల్స్ సమక్షంలో చర్చలు జరిగాయి. ఆ సమయంలో జమ్ముకశ్మీర్ నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దు వద్ద కాల్పులకు చరమగీతం పాడేద్దామని పాక్ ఏకపక్షంగా నిర్ణయించింది. ఇదే కాల్పుల విరమణ ఒప్పందం(సీఎఫ్ఏ)గా పేర్కొంటారు.
- సీఎఫ్ఓ 2003అనేది లిఖితపూర్వక ఒప్పందం కాదు. 1949నుంచి 1972 మధ్య జరిగిన చర్చల్లో చేసుకున్న ప్రతిపాదనల ప్రకారం.. జమ్ముకశ్మీర్‌లో శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు హాట్లైన్లు, ఫ్లాగ్ మీటింగ్‌లు ఏర్పాటు చేసుకోవాలని అంగీకరించుకున్నాయి ఇరుదేశాలు.
ఎలా ఉల్లంఘిస్తారంటే...?