తుర్కియే, సిరియాలో పెను భూకంపం ఏర్పడి భవనాలన్నీ ధ్వంసం అయ్యాయి. వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలతో బయటపడ్డవారు ఎముకలు కొరికే చలితో నరకం అనుభవిస్తున్నారు. ఇదంతా టీవీలో చూసిన 8 ఏళ్ల బాలుడు వారికోసం ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నాడు. తాను ఇన్నేళ్లపాటు కూడబెట్టిన పాకెట్ మనీ మొత్తాన్ని ఖర్చు చేసి కొందరికైనా చలి నుంచి ఉపశమనం కలిగించాలని నిర్ణయించుకున్నాడు. భూకంప బాధితులు చలిని తట్టుకునేందుకు 112 జాకెట్లను కొన్నాడు. ఆ బాలుడే దిల్లీకి చెందిన జైదాన్ ఖురేషీ.
జైదాన్ ఖురేషీ తన తండ్రితో దిల్లీలోని తుర్కియే రాయబార కార్యాలయానికి వెళ్లి భూకంప బాధితులకు ఇవ్వమని 112 జాకెట్లను అందించాడు. 'కొన్ని రోజుల క్రితం టీవిలో తుర్కియేలో భూకంపం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలను చూశా. బాధితులకు ఏదైనా సాయం చేయాలని నిర్ణయించుకున్నా. అప్పుడు నా తండ్రికి ఇదే విషయం చెప్పా. ఆయనా భూకంప బాధితులకు ఏదైనా సాయం చేద్దామని అన్నారు.' అని జైదాన్ చెప్పాడు.
పాకెట్ మనీతో సహాయం
జైదాన్ తన తండ్రి నుంచి ప్రతిరోజూ రూ.100 పాకెట్ మనీగా తీసుకుని కొంత డబ్బును కూడబెట్టాడు. తుర్కియే ప్రజలకు సహాయం చేయాలనుకున్న తర్వాత జైదాన్ తండ్రి తన పాకెట్మనీకి మరి కొంత డబ్బు కలిపి 112 జాకెట్లను కొన్నాడు. వాటిని వారు తుర్కియే రాయబార కార్యాలయం ద్వారా ఆ దేశ ప్రజల కోసం పంపించారు.