తెలంగాణ

telangana

By

Published : Feb 8, 2023, 4:31 PM IST

Updated : Feb 8, 2023, 6:21 PM IST

ETV Bharat / bharat

బిడ్డకు జన్మనిచ్చిన ట్రాన్స్​జెండర్​ జంట.. చిన్నారికి పాల కోసం ప్రత్యేక ఏర్పాటు!

సాధారణంగా ట్రాన్స్ జెండర్​లు తల్లిదండ్రులయ్యే అవకాశమే ఉండదని అందరూ అనుకుంటారు. కానీ కేరళకు చెందిన ఓ ట్రాన్స్​జెండర్ జంట పండంటి బిడ్డను కన్నారు. దీంతో వీరు దేశ చరిత్రలోనే బిడ్డకు జన్మనిచ్చిన మొట్టమొదటి ట్రాన్స్ జెండర్​ జంటగా నిలిచారు.

A baby was born to a transgender couple
బిడ్డకు జన్మనిచ్చిన ట్రాన్స్​ జెండర్​ జంట

దేశంలో తొలిసారిగా వింత సంఘటన జరిగింది. అతడుగా మారిన ఆమె, ఆమెగా మారిన అతడు కలిసి సృష్టికి భిన్నంగా తల్లిదండ్రులయ్యారు. కేరళకు చెందిన ఈ ట్రాన్స్​ జెండర్​ జంట బుధవారం ఉదయం పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీబిడ్డలు ఇద్దరూ ఆరోగ్యంగానే ఉన్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమెగా మారిన అతడు వెల్లడించాడు. వారే కేరళకు చెందిన జియా, జహద్​ దంపతులు.

ఇటీవలే జియా తన ఇన్​స్టాగ్రామ్​లో జహద్​ 8 నెలల గర్భవతి అని.. మార్చి 4న బిడ్డకు జన్మనిస్తుందని పోస్ట్ చేశారు. ఇందుకు సంబంధించి బేబీ బంప్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు ఈ జంట. అయితే అనుకున్న తేదీ కంటే ముందుగానే కోజికోడ్ మెడికల్​ కాలేజీ వైద్యులు జహద్​కు సిజేరియన్​ చేశారు. దీంతో బుధవారం ఉదయం 9:30 గంటలకు పండంటి బిడ్డకు జన్మనిచ్చినట్లు జియా వెల్లడించాడు. ప్రస్తుతం తల్లీబిడ్డలిద్దరూ ఆరోగ్యంగానే ఉన్నారని జియా తెలిపారు.

పండంటి బిడ్డకు జన్మనివ్వడంపట్ల ట్రాన్స్​జెండర్​లు ఆనందం వ్యక్తం చేశారు. దేశంలోనే తొలి ట్రాన్స్‌జెండర్ పైలట్ అయిన ఆడమ్ హ్యారీ కూడా.. తన జీవితంలో ఇంతటి ఆనందాన్ని అనుభవించలేదని జియా అన్నారు. అయితే వారిని పుట్టిన బిడ్డ ఆడ, మగ అనే విషయాన్ని రహస్యంగా ఉంచుతున్నట్లు తెలిపారు. జహద్​ తన బిడ్డకు పాలిచ్చే వీలు లేనందున.. ఆస్పత్రి పాల బ్యాంక్​ ద్వారా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు వైద్యులు. తల్లిదండ్రులైన వీరికి పలువురు అభినందనలు తెలిపారు.

బిడ్డకు జన్మనిచ్చిన ట్రాన్స్ జెండర్​ జంట

ఇదీ వారి కథ..
కేరళకు చెందిన జహద్, జియాలిద్దరూ.. దాదాపు రెండేళ్లకు పైగా సహజీవనం చేస్తున్నారు. పుట్టుకతోనే అమ్మాయి అయిన జహద్ లింగ మార్పిడి ట్రీట్​మెంట్ ద్వారా అబ్బాయిగా మారాలని అనుకుంది. మగవాడైన జియా కూడా అలానే అమ్మాయిగా మారాలని కోరుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఇద్దరూ కలిసి ఆసుపత్రికి వెళ్లి.. వైద్యులను సంప్రదించారు.

వీరిద్దరి కోరిక మేరకు వైద్యులు వారికి 'హార్మోన్​ థెరపీ' ప్రక్రియ ప్రారంభించారు. చికిత్స మధ్యలో ఉండగా.. వారికి ఓ చిక్కు వచ్చి పడింది. ట్రీట్​మెంట్ మొదలు పెట్టిన డాక్టర్లకు ఓ ఆసక్తికర విషయం తెలిసింది. అదేంటంటే.. జహద్ అప్పటికే ప్రెగ్నెంట్ అని వైద్యులు గుర్తించారు. దీంతో తర్జనభర్జనకు గురైన వైద్యులు జహద్​ను అబ్బాయిగా మార్చే చికిత్సను మధ్యలోనే ఆపేశారు. అయితే దశల వారీగా కొనసాగే ఈ చికిత్సలో భాగంగా ఇప్పటికే జహద్ వక్షోజాలను తొలగించారు వైద్యులు. మిగిలిన ప్రక్రియ పూర్తి కాలేదు కాబట్టి జహద్ సాధారణ కాన్పుతోనే బిడ్డకు జన్మనివ్వొచ్చు అని చెప్పారు. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తాను అబ్బాయిలా మారిపోయే చికిత్సను కొనసాగించి.. పూర్తిగా మగాడిలా మారిపోతానని చెబుతున్నారు జహద్. వారి బేబీ బంప్​ ఫొటోలను చూడాలంటే ఇక్కడ క్లిక్​ చేయండి.

జహద్​ ఓ ప్రైవేట్ కంపెనీలో అకౌంటెంట్​గా విధులు నిర్వర్తించేది. జియా పిల్లలకు డ్యాన్స్​ నేర్పించేవాడు. గర్భం దాల్చిన తర్వాత.. జహద్ పనికి వెళ్లడం మానేశాడు. నడకవ్ ఓం స్కూల్ ఆఫ్ డ్యాన్స్‌కు చెందిన ఓ వ్యక్తి సహాయంతో ప్రస్తుతం వారి జీవితం ముందుకు సాగుతోందని జియా తెలిపాడు. సాయం అందించాలని కోరుతూ ముఖ్యమంత్రికి, సాంఘిక సంక్షేమ శాఖకు వినతిపత్రం అందజేస్తామన్నారు జియా. సమాజంలో తమ బిడ్డ ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయో అని కొంత ఆందోళన చెందుతున్నట్లు జియా తెలిపారు. తమ బిడ్డ సమాజంలో తల ఎత్తుకుని జీవించాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు.

Last Updated : Feb 8, 2023, 6:21 PM IST

ABOUT THE AUTHOR

...view details