తమిళనాడులోని కిల్లనూర్లో దారుణం జరిగింది. ఆలయంలోని వస్తువులను దొంగిలించే ఓ ముఠాను పట్టుకున్న స్థానికులు వారిని చితకబాదారు. ఈ ఘటనలో ఆ గ్యాంగ్‌కు చెందిన ఓ 10 చిన్నారి తీవ్రంగా గాయపడి, ప్రాణాలు కోల్పోయింది. స్థానికుల సమాచారంతో చోరీలకు పాల్పడ్డ వారిని అదుపులోకి తీలుకున్న పోలీసులు వారిపై కేసు నమోదు చేసుకుని రిమాండ్‌కు తరలించారు.
దొంగల ముఠా కోసం 20కి.మీ ఛేజ్.. మూకదాడిలో గాయపడి చిన్నారి మృతి - దొంగల ముఠాను చితక బాదిన స్థానికులు
కొంత కాలంగా ఆలయాల్లో చోరీలకు పాల్పడుతున్న ఓ గ్యాంగ్‌ను పట్టుకున్న ఊరి ప్రజలు ఆగ్రహంతో వారిని చితకబాదారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఓ చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.
20 కిలోమీటర్లు వెంటాడి..
కడలూర్‌లోని ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులు గత కొంత కాలంగా ఆలయాల వెలుపల కట్టి ఉన్న గంటలు, ఇతర వస్తువులను దొంగలించేవారు. అలా ఓ ఆలయంలో చోరీకి పాల్పడుతున్న సమయంలో ముఠాను గుర్తించిన స్థానికులు వారిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. అప్పటికే ఆ గ్యాంగ్ ఆటో ఎక్కి పారిపోగా.. స్థానికులు సినిమా రేంజ్లో వారిని 20 కిలోమీటర్ల వరకు ఛేజ్ చేసి పట్టుకున్నారు. ఆగ్రహంతో ముఠా సభ్యుల్ని చితకబాదారు. అందులోని ఓ 10 ఏళ్ల చిన్నారి తలకు తీవ్రగాయాలయ్యాయి.
ఆ బాలికను హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. తన తలకు గాయాలయినందున వెంటనే శస్త్ర చికిత్స చేయాలని వైద్యులు తెలిపారు. అలా చికిత్స పొందుతున్న చిన్నారి బుధవారం మృతి చెందింది. స్థానికుల సమాచారంతో నిందితులను పట్టుకున్న పోలీసులు వారి వద్ద నుంచి 200 కేజీల రాగి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. కాగా ఆ గ్యాంగ్‌లో ఉన్న ఆరుగురిలో ఓ బాలిక మృతి చెందగా.. మిగిలినవారిలో ఓ బాలికతో పాటు ఓ మహిళ ఉన్నారని పోలీసులు తెలిపారు.