భారత్ తయారు చేసిన టీకాలకు ప్రపంచవ్యాప్తంగా ఆమోదం లభిస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) 8 వ్యాక్సిన్లకు అత్యవసర అనుమతులు జారీ చేస్తే.. అందులో రెండు(కొవిషీల్డ్, కొవాగ్జిన్) టీకాలు భారత్కు చెందినవి ఉండటం గర్వకారణమని అన్నారు. 96 దేశాలు ఈ రెండు టీకాలను గుర్తించాయని చెప్పారు. టీకా ధ్రువీకరణ పత్రాన్ని (India Vaccination Certificate) పరస్పరం ఆమోదించుకునేందుకు ఈ దేశాలు అంగీకారం తెలిపాయని చెప్పారు. కొవిన్ యాప్లో ఈ దేశాల జాబితా అందుబాటులో ఉందని తెలిపారు.
మరిన్ని దేశాల్లో టీకా ధ్రువీకరణ పత్రానికి (Covid Vaccine Certificate) గుర్తింపు కోసం భారత్ ప్రయత్నిస్తోందని మాడవీయ స్పష్టం చేశారు. భారత టీకాలకు గుర్తింపునిచ్చిన దేశాలకు వెళ్తే ప్రయాణ ఆంక్షలకు మినహాయింపు ఉంటుందని తెలిపారు.