ఆ పెద్ద మనిషికి 91 ఏళ్లు. వృత్తిరీత్యా ఆయన ఓ రైల్వే కూలి. అయినా ఇప్పటికీ కష్టపడి పనిచేస్తున్నాడు. విశ్రాంతి తీసుకునే సమయంలో ఓ యువకుడిలా బరువులు మోస్తున్నాడు. తొమ్మిది పదుల వయస్సులోనూ తన కాళ్లపై తాను నిలబడుతూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు. 15 ఏళ్ల వయస్సులో పాకిస్థాన్ నుంచి భారత్ వచ్చిన ఆ వృద్దుడు నేటికీ అలుపెరగకుండా పనిచేసుకుంటున్నాడు. అతడే హరియాణాకు చెందిన కిషన్‌చంద్.
భారత్, పాకిస్థాన్ విడిపోక ముందు కిషన్‌చంద్(91) ఖెలయా జిల్లాలో నివాసం ఉండేవాడు. విభజన అనంతరం భారత్‌లోని పానీపత్కు వచ్చాడు. విభజన సమయంలో జరిగిన దృశ్యాలన్ని అతడు కళ్లారా చూశాడు. భారత్-పాకిస్థాన్ విడిపోయిన సమయంలో కిశన్ వయస్సు 15 సంవత్సరాలు. భారత్‌కు వచ్చిన అతడు సొంతిళ్లు లేని కారణంగా రైల్వే స్టేషన్లోనే స్థిరపడ్డాడు. స్టేషన్లోనే కూలీ పనులు చేస్తూ జీవనం సాగించాడు. అలా నేటికీ అక్కడే పని చేస్తున్నాడు. కిషన్‌చంద్ 35 ఏళ్ల వయస్సులో పెళ్లి చేసుకున్నాడు. అతడికి ఓ కూతురు, నలుగురు కుమారులు ఉన్నారు. అయినా వారిపై ఆధారపడకుండా తన పని తానే చేసుకుంటున్నాడు. తన పిల్లలందరూ బాగా కష్టపడుతారని, వాళ్లు తనను బాగానే చూసుకుంటారని, అయినా వారి నుంచి ఏమి ఆశించకుండా తన ఖర్చులు తానే వెళ్లదీసుకుంటున్నానని కిషన్ తెలిపాడు.