Reena Varma Rawalpindi: పాకిస్థాన్‌లోని రావల్పిండిలో ఉన్న తన పూర్వీకుల ఇల్లు 'ప్రేమ్ నివాస్' చూడాలన్న 90 ఏళ్ల రీనా ఛిబ్బర్ వర్మ కల 75 ఏళ్ల తర్వాత నెరవేరుతోంది. పాక్ అధికారులు ఆమెకు వీసా మంజూరు చేయడం వల్ల వాఘా- అటారీ సరిహద్దు గుండా శనివారం ఆమె రావల్పిండికి చేరుకున్నారు. దేశ విభజన సమయంలో పదిహేనేళ్ల ప్రాయాన ఈ ప్రాంతం వీడి వెళ్లిన రీనా ఇక్కడకు రాగానే పాక్కు బయల్దేరారు.
మహారాష్ట్రలోని పుణెలో ఇంతకాలం నివసించిన ఈమె రావల్పిండితో తన అనుబంధాన్ని పంచుకుంటూ సామాజిక మాధ్యమాల్లో వీడియో పెట్టారు. విభజనకు ముందు హిందూ, ముస్లిం తేడాల్లేకుండా తామంతా కలిసి మెలిసి ఉండేవారమని అందులో పేర్కొన్నారు. పాక్ వీసా కోసం తాను పలుమార్లు ప్రయత్నం చేసి విఫలమైనట్లు తెలిపారు. ఈ వీడియో చూసిన పాక్ పౌరుడు సజ్జాద్ హైదర్.. రీనాతో మాట్లాడి, రావల్పిండిలోని ఆమె పూర్వీకుల ఇంటి చిత్రాలు పంపారు. భారత్‌లోని పాకిస్థాన్ హైకమిషన్ సద్భావన చర్య కింద ఈమెకు మూడు నెలల వీసా మంజూరు చేసింది. దీంతో పాక్ చేరుకున్న రీనా ఇక్కడ గడిపిన తన బాల్యాన్ని, చదివిన పాఠశాలను, స్నేహితులను గుర్తు చేసుకున్నారు.