కరోనా లాక్డౌన్ వేళ సేవలందించిన పోలీసులు ఎదుర్కొన్న కష్టాలు అన్నీఇన్నీ కావు. ఎన్నో శ్రమలకోర్చి విధులు నిర్వర్తించారు. ఆ సమయంలో దిల్లీ పోలీసులు అంబులెన్స్‌లు అందుబాటులో లేని సమయాల్లో నెలలు నిండిన 997 మంది గర్భిణీలను పోలీస్ కంట్రోల్ రూమ్(పీసీఆర్) వాహనాల్లో ఆసుపత్రులకు తరలించారు.
ఈ క్రమంలో 9 గర్భిణీలు పీసీఆర్ వాహనాల్లోనే శిశువులకు జన్మనిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ తొమ్మిది మంది మహిళలను దిల్లీ పోలీసు కమిషనర్ సోమవారం సత్కరించనున్నారు. కొత్తగా నిర్మించిన పోలీసు ప్రధాన కార్యాలయంలో ఈ కార్యక్రమం జరగనుంది.
మరపురాని ఘటన..
గత ఏప్రిల్‌లో దిల్లీ పాలం సమీపంలోని పంచవతి వద్ద ఓ మహిళ పురిటి నొప్పులతో బాధపడుతోందని ఫోన్ వచ్చింది. పోలీసులు చేరుకునేసరికే తల్లి గర్భం నుంచి శిశువు సగం బయటకు వచ్చింది. వెంటనే సమీపంలోని టీ షాపు మహిళ సహాయంతో గర్భిణీకి ప్రసవం చేశారు. ఆమెకు ఆడపిల్ల పుట్టింది. ఆ పాపకు సోనియా అని పేరు పెట్టారు. ఇప్పుడు సంవత్సరం వయస్సున్న ఆ చిన్నారికి నాడు పోలీసులు ప్రాణం పోశారు. ఇలా అప్పటి అనుభవాలను గుర్తు చేసుకున్నారు పోలీసులు.