కర్ణాటకలో దారుణం జరిగింది. ఓ కామాంధుడు.. దారి తెలియక సహాయం అడిగిన బామ్మను హత్య చేసి.. అనంతరం ఆమెపై అత్యాచారం చేశాడు. వృద్ధురాలిని ఏనుగులు లేదా ఏమైనా జంతువులు చంపాయని పోలీసులు భావించగా.. పోస్ట్‌మార్టంలో అత్యాచారం జరిగినట్లు తేలింది. వెంటనే దర్యాప్తు చేపట్టిన పోలీసులు వృద్ధురాలిపై అత్యాచారం చేసిన నిందితుడ్ని అరెస్ట్ చేశారు. ఏప్రిల్ 1న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
హాసన్ జిల్లాలోని యారెనహళ్లి ప్రాంతానికి చెందిన 85 ఏళ్ల వృద్ధురాలు తన పొలాన్ని చూసేందుకు ఏప్రిల్ 1న ఇంటి నుంచి బయటకు వచ్చింది. అయితే అదే రోజు సాయంత్రం ఆ వృద్ధురాలి దారి తెలియక మరో దారిలోకి వెళ్లింది. అదే సమయంలో అటుగా వస్తున్న మిథున్ కుమార్(32) అనే యువకుడిని సహాయం కోరింది. అయితే కుమార్ కొద్ది దూరం పాటు ఆమెను తనతో తీసుకువెళ్లాడు. అనంతరం ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ వృద్ధురాలు ఎదురుతిరగడం వల్ల.. పక్కనే ఉన్న రాయితో ఆమెను కొట్టి చంపాడు కుమార్. అనంతరం ఆమెపై అత్యాచారం చేసి అక్కడ నుంచి పరారయ్యాడు.
ఏప్రిల్ 2న పంటపొలాల్లో వృద్ధురాలి మృతదేహం లభ్యమైనట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. ఏనుగు లేదా మరేదైన జంతువు ఆమెను చంపి ఉండొచ్చని ప్రాథమికంగా అంచనా వేశారు. అనంతరం వృద్ధురాలి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే పోస్ట్‌మార్టంలో ఆ వృద్ధురాలిపై అత్యాచారం జరిగినట్లు తేలింది. దీంతో పోలీసులు నిందితుడి కోసం వెతకడం ప్రారంభించారు. అదే రోజు సాయంత్రం మిథున్ కుమార్‌తో వృద్ధురాలిని చూసినట్లు స్థానికులు పోలీసులకు తెలిపారు. దీంతో పోలీసులు మిథున్ కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా.. తానే ఈ పని చేసినట్లు అంగీకరించాడు.
ఇటలీ మహిళపై దారుణం!
ఓ విదేశీయురాలికి భారత్‌లో వేధింపులు ఎదురయ్యాయి. ఇటలీకి చెందిన ఓ మహిళ ట్రైన్లో జైసల్మేర్‌కు ప్రయాణిస్తున్న సమయంలో.. కోట్ అటెండర్ ఆమెపై వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు స్నేహితుడు జరిగిన విషయాన్ని రైల్వే మంత్రికి ట్వీట్ ద్వారా తెలియజేశాడు. ఆ వ్యక్తి ట్వీట్ మేరకు ఆర్పీఎఫ్, జీఆర్పీఎఫ్ పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరచారు. కోర్టు నిందితుడ్ని 6 నెలల పాటు విధుల నుంచి తప్పిస్తున్నట్లు తీర్పునిచ్చింది.
ఏప్రిల్ 5న ఇటలీకి చెందిన ఓ మహిళ ఉత్తరాఖండ్ నుంచి రాజస్థాన్‌లోని జైసల్మేర్‌కు రాణిఖేత్ ఎక్స్ప్రస్లోని ఏ1 బోగీలో ప్రయాణించింది. అయితే ఆమె తన బోగీలో ఒంటరిగా కూర్చుని ఉండడాన్ని కోచ్ అటెండర్ శ్రీ బంగాలీ గుప్త(53) గమనించాడు. ఇదే అదనుగా భావించి ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. అయితే తీవ్రంగా భయపడిన ఆ విదేశీయురాలు అతడి బారి నుంచి తప్పించుకోవడానికి బాత్రూంలో దాక్కుంది. బాత్రూంలో ఉంటూనే భారత్‌లో ఉన్న తన స్నేహితుడికి జరిగిన విషయాన్ని ఫోన్ ద్వారా తెలిపింది. దీంతో ఆమె స్నేహితుడు వెంటనే ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు ఫిర్యాదు చేశాడు. వెంటనే అప్రమత్తమైన ఆర్పీఎఫ్, జీఆర్పీఎఫ్ పోలీసులు ట్రైన్ ఫలోడి ప్రాంతానికి రాగానే.. విదేశీయురాలిని వేధింపులకు గురిచేసిన బంగాలీ గుప్తను అదుపులోకి తీసుకున్నారు. అయితే మహిళ ఈ విషయంపై లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయకపోయినా సరే.. రైల్వే పోలీసులు నిందితుడ్ని కోర్టులో హాజరుపరిచారు. కోర్టు 6 నెలల పాటు నిందితుడిని విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపింది.
వ్యాటర్ ట్యాంక్‌లో చిన్నారి మృతదేహం
మహారాష్ట్రలో తొమ్మిదేళ్ల చిన్నారి అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. తన ఇంటికి సమీపంలో ఉన్న ఓ భవనంలోని వాటర్ ట్యాంక్‌లో విగతజీవిగా కనిపించింది. ఠానే జిల్లాలో ఏప్రిల్ 3న తొమ్మిదేళ్ల చిన్నారి ఇంటి నుంచి దగ్గర్లో ఉండే ఓ దుకాణానికి వెళ్లింది. అయితే ఆ చిన్నారి ఎంతసేపైనా ఇంటికి రాకపోవడం వల్ల ఆమె కుటుంబసభ్యులు గాలింపు చర్యలు చేపట్టారు. ఎంత వెతికినా సరే ఫలితం లేకపోగా వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రెండు రోజుల తర్వాత చిన్నారి తన ఇంటికి సమీపంలో ఉన్న ఓ భవనం వాటర్ ట్యాంక్‌లో మృతిచెంది ఉండడాన్ని గుర్తించారు. వెంటనే చిన్నారి మృతదేహాన్ని శవపరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఈ ఘటన పూర్తి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ప్రేమ వ్యవహారం కారణంగా.. లైవ్‌లో ఆత్మహత్య!
ఉత్తర్‌ప్రదేశ్‌లోని బాందా జిల్లాలో ఓ యువకుడు వ్యక్తిగత కారణాల దృష్ట్యా ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ వీడియో పెడుతూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ యువకుడు తాను చనిపోయే ముందు ఇన్‌స్టాలో.. 'నేను చనిపోతాను, అందరికీ రామ్-రామ్. అమ్మానాన్నలు నన్ను క్షమించడం. నేను నిస్సహాయ స్థితిలో ఉన్నాను' అంటూ ఓ పోస్ట్ కూడా చేశాడు. ఆ యువకుడు ఓ హోటల్లో గదిలో అద్దెకు తీసుకుని లైవ్ వీడియోలో ఆత్మహత్య చేసుకున్నాడు. లైవ్ వీడియో చూసిన అతడి స్నేహితులు వద్దని చెప్పినా సరే ఆ యువకుడు వారి మాటలు పట్టించుకోకుండా ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. సమాచారం అందుకున్నా సరే పోలీసులు ఆ యువకుడి ఆచూకీ గుర్తించలేక పోయారు. అయితే హోటల్ సిబ్బంది యువకుడు గది తలుపులు మూసివేసి ఉండడాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. ప్రేమ వ్యవహారం కారణంగానే ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.
ట్యూషన్ టీచర్ దెబ్బకు బాలుడికి వినికిడి లోపం!
మహారాష్ట్రలోని ఠానే జిల్లాలో ఓ ట్యూషన్ టీచర్ 12 ఏళ్ల బాలుడ్ని దారుణంగా కొట్టాడు. ఫలితంగా ఆ బాలుడికి వినికిడి లోపం ఏర్పడింది. బాధితుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ టీచర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మార్చి 31న ఆ బాలుడు హోంవర్క్ చేయలేదని.. ట్యూషన్ టీచర్ బాలుడు చెవిపై గట్టిగా కొట్టాడు. దీంతో ఆ బాలుడు ఇంటికి వెళ్లాక జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాడు. అయితే తమ కుమారుడి పరిస్థితిని గమనించిన వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బొగ్గు గని కూలీ మిస్సింగ్.. రెండు నెలల తర్వాత దారుణం!
అసోంలో రెండు నెలల క్రితం కనిపించకుండా పోయిన ఓ వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. టిన్సుకియా జిల్లాలోని లెడో బొగ్గు గనిలో పనిచేస్తున్న ప్రాంజల్ మోరన్ అనే వ్యక్తి ఫిబ్రవరి 1నుంచి కనిపించడం లేదని అతడి భార్య ఊర్వశి మోరన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కార్మిక సంఘూలు పెద్ద ఎత్తున ప్రాంజల్ మోరన్ను కనిపెట్టాలని నిరసనలు తెలిపాయి. దీంతో పోలీసులు 7 రోజుల్లో మోరన్ ఆచూకి కనుక్కుంటామని అతని భార్యకు హామీ ఇచ్చారు. అయితే పోలీసులు కొన్నిరోజుల పాటు మోరన్ కోసం గాలించినా సరే అతడి ఆచూకీ లభించలేదు. దీంతో మోరన్ కనిపించకుండా పోవడానికి బొగ్గు అక్రమ తరలింపే కారణంగా భావించిన పోలీసులు బొగ్గు గనికి సంబంధించి ఇద్దర్ని అరెస్ట్ చేశారు.