Jayalalitha Brother Vasudevan: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు తాను సోదరుడినంటూ కర్ణాటకకు చెందిన ఓ వృద్ధుడు.. మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆమె ఆస్తిలో సగం వాటా తనకు ఇవ్వాలని పిటిషన్లో కోరారు.
మైసూరులోని వ్యాసపురానికి చెందిన వాసుదేవన్ (83) మద్రాసు హైకోర్టులో ఈ వ్యాజ్యం వేశారు. 2020లో మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పులో జయలలిత వారసులుగా దీపక్, దీపతో పాటు తన పేరును కూడా చేర్చి తీర్పును సవరించాలని ఆయన కోరారు.
"జయలలిత తండ్రి జయరామ్ మొదటి భార్య జయమ్మ ఒక్కగానొక్క కుమారుడ్ని నేను. ఆ తర్వాత మా నాన్న జయరామ్.. వేదమ్మ అనే మహిళను రెండో వివాహం చేసుకున్నారు. వారికి పుట్టిన వారే జయలలిత, జయకుమార్. 1950లో మా అమ్మ జయమ్మ మైసూరు కోర్టులో భరణం కోసం కేసు వేసింది. ఆ కేసులో మా నాన్న రెండో భార్య వేదమ్మ, జయకుమార్, జయలలితను ప్రతివాదులుగా చేర్చాం. తర్వాత ఆ కేసు కొలిక్కి వచ్చింది. కానీ జయలలిత కంటే ముందే జయకుమార్ మరణించారు. కాబట్టి జయలలితకు సోదరుడిగా నేను కూడా వారసుడ్ని. అందుకే ఆమె ఆస్తిలో 50 శాతం నాకే ఇవ్వాలి."
-- పిటిషన్లో వాసుదేవన్