మహారాష్ట్రలో వరద బీభత్సానికి 112 మంది చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. 53 మంది గాయాల పాలయ్యరని, మరో 99 మంది గల్లంతైనట్లు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పారు. 1,35,313 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు పేర్కొన్నారు. కాగా, ఎన్డీఆర్ఎఫ్, రాష్ట్ర యంత్రాంగం సహాయక చర్యలను ముమ్మరం చేశాయి.
రాయ్‌గడ్, రత్నగిరి, కొల్హాపూర్ జిల్లాలతో పాటు , కొంకన్ తీర ప్రాంతంపై వరదలు తీవ్రంగా ప్రభావం చూపాయి.
ఠాక్రే ఏరియల్ సర్వే..
రాయ్ గఢ్ జిల్లాలో పర్యటించిన సీఎం ఉద్ధవ్ ఠాక్రే అక్కడి పరిస్థితిని పరిశీలించారు. నష్టపోయినవారికి పరిహారం అందిస్తామన్నారు. కొండచరియలు విరిగి పడి అనేక మంది ప్రాణాలు బలితీసుకున్న నేపథ్యంలో కొండ ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుంటామని ఠాక్రే తెలిపారు.
రాష్ట్రపతి ఆరా..
మహారాష్ట్రలో పెద్ద ఎత్తున మరణాలు, ఆస్తినష్టం సంభవించడంపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ విచారం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారికి ఫోన్‌చేసిన రాష్ట్రపతి వరదల పరిస్థితి, సహాయకచర్యలు సాగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు.
విదర్భలో ఎంపీ నవనీత్ కౌర్ రాణా పర్యటించారు. అక్కడి పరిస్థితిపై సమీక్షించి, సహాయక చర్యలను పరిశీలించారు.