గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు చెందిన 81 ఏళ్ల దౌద్‌భాయ్ ఫుల్నీ.. 8 ఏళ్లప్పుడే క్రీడల పట్ల ఆకర్షితుడయ్యారు. అప్పటినుంచి దేశనలుమూలల జరిగే క్రీడా పోటీల్లో పాల్గొంటూ అనేక పతకాలు సాధించారు. ఆయన పోటీల్లో పాల్గొని పతకం సాధించని ఒక్క క్రీడంటూ లేదంటే అతిశయోక్తి కాదు. ప్రతి పోటీలోనూ స్వర్ణ పతకం గెలవాలన్న ధ్యేయంతో పాల్గొంటుంటారు. రాజ్‌కోట్‌లోని రాజ్‌కుమార్ కళాశాలలో ప్రవేశం పొందినప్పటి నుంచి తనకు క్రీడలపై మక్కువ మరింత పెరిగిందని ఫుల్నీ తెలిపారు. అప్పుడు తొలిసారిగా క్రికెట్‌లో స్వర్ణ పతకం వచ్చిందని అన్నారు. ధర్మేంద్రసిన్హ్‌జీ కాలేజీలో చదివే రోజుల్లో రాష్ట్ర స్థాయి స్విమ్మింగ్ పోటీల్లో రెండో స్థానం సాధించినట్లు వివరించారు.
దౌద్‌భాయ్ ఫుల్నీ ఇప్పటి వరకు పాల్గొన్న అన్ని పోటీల్లో దాదాపు 200 పై చిలుకు పతకాలను సాధించారు. మొత్తం 4 ఆలిండియా రికార్డులను బద్దలు కొట్టినట్లు తెలిపారు. ఇప్పటి దాకా పలు రకాల క్రీడా పోటీల్లో 60 స్వర్ణ పతకాలు, 75 వెండి పతకాలు, 80 రజత పతకాలు సాధించినట్లు ఫుల్నీ వివరించారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 15 స్వర్ణ పతకాలు గెలిచినట్లు తెలిపారు.
ఇప్పటికీ రోజూ సాయంత్రం స్విమ్మింగ్ చేస్తానని.. తినే విషయంలో, తాగే విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటానని దౌద్‌భాయ్ ఫుల్నీ తెలిపారు. 60 ఏళ్ల క్రితం క్రీడలవైపు తమను ఎవరూ ప్రోత్సహించే వారు కారని, నేటి కాలం వారికి తాము కోరుకున్న రంగం వైపు వెళ్లే అవకాశముందని తెలిపారు. అయినప్పటికీ కొంత మంది యువత వ్యసనాల పట్ల ఆకర్షితులవుతున్నారని అన్నారు. అటువంటి అలవాట్లను వదిలేయాలని సందేశం ఇవ్వాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. సెల్‌ఫోన్ వాడకం వీలైనంత వరకు తగ్గించి శారీరక క్రీడలపై దృష్టి పెట్టాలని దౌద్‌భాయ్ ఫుల్నీ తెలిపారు.