8 Feet Gold Throne For Ayodhya Ram Mandir :ఉత్తర్‌ప్రదేశ్ అయోధ్య రామాలయ గర్భగుడిలో పాలరాతితో చేసి.. బంగారు పూత పూయించిన 8 అడుగుల ఎత్తున్న సింహాసనాన్ని నెలకొల్పనున్నారు. ఈ పీఠంపై రామ్‌లల్లా విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఈ బంగారు సింహాసనం ఎనిమిది అడుగుల ఎత్తు, నాలుగు అడుగుల వెడల్పుతో ఉంటుందని.. దీనిని రాజస్థాన్‌లోని హస్తకళాకారులు తయారు చేస్తున్నారని ఆలయ ట్రస్టు సభ్యుడు అనిల్ మిశ్ర మంగళవారం వివరించారు. డిసెంబర్ 15 నాటికి ఈ సింహాసనం అయోధ్యకు చేరుకుంటుందని ఆయన తెలిపారు. గర్భగుడి నిర్మాణం కూడా పూర్తయినట్లు మిశ్ర చెప్పారు.
డిసెంబర్ 15 కల్లా పూర్తి..
'డిసెంబర్ 15 నాటికి రామ మందిరం గ్రౌండ్ ఫ్లోర్‌ను సిద్ధం చేయాల్సి ఉంది. మొదటి అంతస్తులో 80 శాతం మేర పనులు పూర్తయ్యాయి. మొదటి అంతస్తులో 17 స్తంభాలు ఏర్పాటు చేయగా, మరో రెండింటి పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి. మొదటి అంతస్తు పైకప్పు నిర్మాణం కూడా డిసెంబర్ 15 కల్లా పూర్తవుతుందని అనుకుంటున్నాం' అని అనిల్ మిశ్ర పేర్కొన్నారు.
భక్తుల కోసం ప్రత్యేకంగా..
పరిక్రమ మార్గ్‌లోని ఫ్లోరింగ్ పనులు కూడా పూర్తయ్యాయని.. ప్రస్తుతం గృహ మండపం నేలపై మార్బుల్స్ వేసే పనులు కొనసాగుతున్నాయని అనిల్ మిశ్ర తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ఆలయంలోని మూడు అంతస్తుల్లో పైకప్పులు నిర్మించామని.. అలాగే మందిరం ప్రవేశ ద్వారం వెలుపలి గోడ(పార్కోట) పనులు కూడా చివరి దశలో ఉన్నాయని ట్రస్ట్ తలిపింది. ఇది కూడా నవంబర్ చివరినాటికి పూర్తవుతుందని ట్రస్ట్ సభ్యుడు మిశ్ర చెప్పారు.
మరోవైపు, భక్తులు రాముడి కోసం పెద్ద మొత్తంలో బంగారం, వెండి వస్తువులను విరాళంగా ఇచ్చారని.. వాటిని నిల్వ చేయడం కాస్త కష్టం కాబట్టి వాటిని కరిగిస్తామని మిశ్ర వివరించారు. పేరున్న జ్యువెలరీ సంస్థ ఆధ్వర్యంలోనే ఈ పనులు జరుగుతాయని ఆయన తెలిపారు.
'అక్షత పూజ' కోసం 100 క్వింటాళ్ల బియ్యం..!
100 Quintal Rice For Akshat Pooja :మరోవైపు, నవంబర్ 5న ఆలయంలో నిర్వహించే 'అక్షత పూజ' కోసం 100 క్వింటాళ్ల బియ్యాన్ని ఆర్డర్ చేసింది శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్. అలాగే బియ్యం(అక్షతల్లో)లో కలిపేందుకు ఒక క్వింటాల్ పసుపుతో పాటు దేశీ నెయ్యికి కూడా ఆర్డర్ ఇచ్చారు. ఇలా కలిపిన బియ్యాన్ని ఇత్తడి కలశాల్లో నింపి పూజ సమయంలో రాముడి విగ్రహం ముందు ఉంచనున్నారు. ఇలా పూజలో వినియోగించిన అక్షతలను విశ్వ హిందూ పరిషత్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న రామభక్తులకు పంపిణీ చేస్తామని నిర్వాహకులు తెలిపారు.