జూన్ 21.. అంతర్జాతీయ యోగా దినోత్సవం. శరీరంలో రోగనిరోధక శక్తిని సహజంగా పెంచే విధానాల్లో యోగా ఒకటి. వేదకాలం నుంచి ఆదికాలం వరకు సనాతన భారత సంప్రదాయంలోనే ఇమిడి ఉంది యోగా సాధన. పూర్వీకులు శారీరక, మానసికోల్లాసానికి యోగా ఆచరించారు. ప్రాచీనకాలంలో ఎందరో మునులు, యతులు, రుషులు, యోగులు తమ తపోనిష్టకు అనారోగ్యం అడ్డు కాకుండా కనిపెట్టిన ఆసనాలు, ఆచరించిన శ్వాస సంబంధిత ప్రాణాయామాలు ఇప్పుడు ‘యోగా’ పాఠాలుగా మారాయి. మానసిక సమస్యలకు పరిష్కారం, శారీరక రుగ్మతలకు సమాధానం, అధ్మాత్మికానుభూతికి ఆలవాలం యోగానే. జీవనశైలిలో ఎన్ని హైటెక్ వసతులు, పోకడలు భాగమైనా ప్రాచీన యోగా పద్ధతులతోనే ఫలితాలు సాధిస్తున్నారు చాలా మంది.
భారత్ సూచనతోనే..
జూన్ 21.. అంతర్జాతీయ యోగా దినోత్సవం. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం సూచనతో జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా 2015లో ప్రకటించింది ఐక్యరాజ్యసమితి.
అప్పటినుంచి ఏటా యోగా డేను ప్రపంచదేశాలు ఘనంగా జరుపుకుంటున్నాయి. అయితే.. ఈసారి కరోనా మహమ్మారి నేపథ్యంలో ఇంట్లోనే ఉండి యోగా సాధన చేయాలని ఆయా ప్రభుత్వాలు సూచించాయి. మరి ఈ ఏడాది యోగా డే ఇతివృత్తం, ప్రాధాన్యం, యోగా చరిత్ర గురించి తెలుసుకుందాం.