79 వెడ్స్ 66.. వృద్ధాప్యంలో సరికొత్త ప్రయాణం ప్రారంభం ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని జీవితంలోని చరమాంకానికి చేరుకున్న ఆ వృద్ధులు ఈ చివరి దశలో తమకు తోడు అవసరం అని భావించారు. కలిసి ఏడు అడుగులు నడిచేందుకు సిద్ధమయ్యారు. నిరాశ్రయులను చేరదీసే ఓ సంస్థ ఆధ్వర్యంలో వీరిద్దరూ సంప్రదాయ రీతిలో వివాహం చేసుకుని ఒక్కటయ్యారు.
మహారాష్ట్రలోని సంగ్లీ జిల్లా కవతీఖండ్కు చెందిన 79 ఏళ్ల దాదాసాహెబ్ సాలున్కే కొన్ని సంవత్సరాల కిందటే భార్యను కోల్పోయారు. ఉన్న ఒక్కగానొక్క కొడుకు కూడా ఆయనకు దూరంగా ఉండటం వల్ల ఒంటరి జీవితం గడపుతున్నారు. బాధ అయినా, ఆనందమైనా మరొకరితో పంచుకుందామన్నా ఎవరూ లేరు. ఈ ఒంటరితనాన్ని భరించలేని సాలున్కే.. తన జీవితంలో తోడు అవసరం అని భావించి, మరోసారి వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని కుమారుడి వద్ద ప్రస్తావించగా అతను అందుకు అంగీకరించాడు.
వివాహం చేసుకున్న సాలున్కే, షాలినీ కానీ.. ఎన్ని ప్రయత్నాలు చేసినా సాలున్కేకు జీవిత భాగస్వామి దొరకలేదు. వయసు, ఆర్థిక స్థితే అందుకు కారణం. నిరాశ్రయులైన మహిళలను చేరదీసే ఆస్తా బేగార్ కేంద్రాన్ని సాలున్కే సంప్రదించారు. ఆయన పరిస్థితిని అర్థం చేసుకున్న నిర్వహకురాలు సురేఖ షహీన్ షేక్.. సాలున్కేకు 66 ఏళ్ల షాలినీని పరిచయం చేశారు. పాషన్కు చెందిన షాలినీ కొన్ని సంవత్సరాల క్రితమే భర్తను, కుమారుడిని పోగొట్టుకున్నారు. ఒంటరైన ఆమె.. ఆస్తా బేగార్ కేంద్రంలో ఆశ్రయం పొందుతున్నారు.
ఒకరినొకరు అర్థం చేసుకున్న సాలున్కే, షాలినీ.. తమ మిగిలిన జీవిత ప్రయాణంలో ఒకరికొకరు తోడుగా ఉండాలనుకున్నారు. ఆస్తా సంస్థ ఆధ్వర్యంలో సంప్రదాయ రీతిలో వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించారు.
ఇదీ చూడండి :అడ్మిషన్ కోసం వచ్చిన విద్యార్థి తల్లితో హెడ్మాస్టర్ మసాజ్