School teacher gets justice: తీర్పును ఆలస్యం చేస్తే న్యాయాన్ని నిరాకరించినట్లే అంటుంటారు. కానీ బంగాల్లో 72 ఏళ్ల ఓ టీచర్ విషయంలో మాత్రం తీర్పు ఆలస్యమైనా న్యాయం ఆమె పక్షానే నిలిచింది. 42 ఏళ్ల సుదీర్ఘ పోరాటం చేసి విజయం దక్కించుకుంది. శ్యామలి ఘోష్ అనే టీచర్ 1976లో షాపుర్‌లోని ఓ పాఠశాలతో టీచర్‌గా జాయిన్ అయ్యారు. కానీ ఆ తర్వాత నాలుగేళ్లకే పరిస్థితులు తలకిందులయ్యాయి. 1980 నుంచి ఆమెను పాఠశాలకు రానివ్వకుండా హెడ్మాస్టర్ నిరాకరించారు. ఆమె ఆరేళ్ల పాటు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో 1986లో కోల్‌కతా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు శ్యామలి. అప్పటి నుంచి న్యాయపోరాటం చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో కోర్టు తీర్పు రాకముందే 2005 నవంబర్ 30న ఆమె పదవీవిరమణ పొందారు. పాఠశాలకు హాజరు కాకుండానే రిటైర్ అయ్యారు.
West bengal teacher: అయితే 2013లో శ్యామలకు రావాల్సిన జీతాన్ని చెల్లించాలని పాఠశాలను ఆదేశించింది హైకోర్టు. ఆమెను డిస్మిస్ చేయలేదు కాబట్టి పెన్షన్ కూడా అందివ్వాలని తెలిపింది. కోర్టు ఆదేశాల తర్వాత బంగాల్ ప్రభుత్వం శ్యామలకు పెన్షన్ ఇవ్వడం ప్రారంభించింది. కానీ ఆమెకు ఇవ్వాల్సిన జీతాన్ని మాత్రం చెల్లించలేదు. దీంతో శ్యామల మరోసారి కోర్టును ఆశ్రయించారు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభిజిత్ గుంగూలీ కీలక తీర్పు వెలువరించారు. శ్యామలకు 25 ఏళ్ల జీతంతో(1980-2005) పాటు దానికి 10 శాతం వడ్డీ జత చేసి చెల్లించాలని పాఠశాల యాజమాన్యాన్ని ఆదేశించారు. 8 వారాల్లోగా ఇది జరగాలని తేల్చి చెప్పారు. అనంతరం తదపరి విచారణను జూన్ 21కి వాయిదా వేశారు.