Old lady legal battle against children: కర్ణాటకలో ఇంట్లో నుంచి గెంటేసిన పిల్లలపై న్యాయపోరాటానికి దిగిన ఓ వృద్ధురాలు ఎట్టకేలకు విజయం సొంతం చేసుకున్నారు. కన్నతల్లికి కనీసం కూడు, గూడు కల్పించకుండా వదిలించుకోవాలని చూసిన సంతానానికి.. న్యాయస్థానం మొట్టికాయలు వేసింది.
Mother legal battle against children
హవేరీ జిల్లా హనగల్ తాలూక వీరపుర గ్రామంలో నివాసం ఉండే ప్రేమవ్వ హవలన్నవర్(76)ను కన్నబిడ్డలే ఇంట్లో నుంచి పంపించేశారు. ఆరేళ్ల క్రితం భర్తను కోల్పోయిన ఆమె సంరక్షణను చూసుకోకుండా.. ఇద్దరు కొడుకులు, కుమార్తె ముఖం చాటేశారు. ఆస్తి మొత్తం తీసేసుకొని కనీసం తిండి పెట్టకుండా, ఏడాది క్రితం ఇంట్లో నుంచి పంపించేశారు.
Karnataka Old lady case on children
ఏ దిక్కూ లేకుండా పోయిన ప్రేమవ్వ.. హవేరీ జిల్లాలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే 'స్వధార్ గృహ్'లో చేరారు. ఈ కేంద్రాన్ని నడిపించే పరిమళ జైన్.. ప్రేమవ్వ గురించి తెలుసుకొని న్యాయసహాయానికి హామీ ఇచ్చారు. 'సవనురూ అసిస్టెంట్ కమిషనర్స్ కోర్టు' ద్వారా ప్రేమవ్వ కొడుకులిద్దరికీ నోటీసులు పంపించారు. ఇద్దరు కుమారులు ప్రతి నెలా రూ.10 వేల చొప్పున ప్రేమవ్వకు చెల్లించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే, కుమారులిద్దరూ నోటీసును బేఖాతరు చేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం.. వీరికి ఉన్న ఆరెకరాల పంట భూమిలో మూడెకరాలను ప్రేమవ్వకు ఇవ్వాలని ఆదేశించింది.