దేశంలోని 141 కోట్ల జనాభా నేడు నిశ్చింతగా నిద్రపోతోందంటే.. అది 14 లక్షలకు పైగా ఉన్న త్రివిధ బలగాల చలవే. దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న మన రక్షణ రంగం గత ఏడున్నర దశాబ్దాల్లో అంచెలంచెలుగా వృద్ధి చెందింది. స్వాతంత్య్రం దక్కిన నాడు దేశమంతా అనేక సంస్థానాలుగా ముక్కలు చెక్కలుగా మిగిలింది. విభజన గాయం ప్రజలనూ విడదీసింది. అంతటి విపత్కర పరిస్థితిలో దేశ ఐక్యతకు చిహ్నమై నిలిచింది మన సైన్యమే. అదే.. సంస్థానాలను కలిపింది. కశ్మీర్‌ను కాపాడుకుంది. పాకిస్థాన్, చైనాలతో జరిగిన అయిదు యుద్ధాల్లో దేశాన్ని రక్షించింది. చైనా తర్వాత అతిపెద్ద మిలిటరీ మనదే, రక్షణ రంగ కేటాయింపుల్లో భారత్‌దే మూడో ర్యాంకు, సైనిక సామర్థ్యంలో అమెరికా, రష్యా, చైనాల తర్వాత మన దేశానిది నాలుగో స్థానం.
రాటుదేలిన రణసేన
స్వతంత్ర భారత ప్రస్థానంలో త్రివిధ సాయుధ దళాల విజయాలు, త్యాగాలు చిరస్మరణీయం. పొరుగునున్న చైనా, పాకిస్థాన్‌లతో యుద్ధాలు తలెత్తినా మన సైన్యం అద్భుత పోరాట పటిమ కనబరిచింది. భద్రత విషయంలో ఇంటాబయటా ఎదురవుతున్న సవాళ్లను దీటుగా ఎదుర్కొంటోంది. గగన వీధుల్లో గర్జించే యుద్ధవిమానాలు, సముద్రజలాల్లో సత్తాచాటే యుద్ధనౌకలు, జలాంతర్గాములు, భూతలంపై శత్రు లక్ష్యాలను ఛేదించే యుద్ధ ట్యాంకులు, క్షిపణుల వంటి అత్యాధునిక ఆయుధాలతో అమ్ములపొదిని శక్తిమంతం చేసుకుంటోంది. రక్షణ రంగం బలోపేతానికి ఇతర దేశాలపై ఆధారపడకుండా... ప్రత్యర్థుల కంటే మేటిగా, అగ్రరాజ్యాలకు దీటుగా ఆయుధాల తయారీకి సమకట్టింది. ఆత్మనిర్భరతను సాధించి, ప్రపంచంలోనే ధీరోదాత్త సేనగా నిలవడమే లక్ష్యంగా త్రివిధ దళాలు సమాయత్తమవుతున్నాయి. ఈ గమ్యాన్ని చేరుకునేందుకు రక్షణ రంగం వచ్చే పాతికేళ్లలో ఎలాంటి చర్యలు చేపట్టాలి? తదుపరి ప్రస్థానం ఎలా సాగాలి..?
ఆదిలోనే పోరుబాట
స్వాతంత్య్రం సిద్ధించిన తొలి నాళ్లలోనే భారత సైనిక ప్రయాణం యుద్ధాలతో ఆరంభమైంది. 1948లో ఆపరేషన్ పోలో పేరుతో హైదరాబాద్‌ను, 1961లో ఆపరేషన్ విజయ్ పేరుతో పోర్చుగీస్ పాలనలోని గోవా, దీవు దమణ్‌లను అంతర్భాగాలుగా చేసుకోగలిగాం. జమ్మూకశ్మీర్, జునాగఢ్ సంస్థానాల విలీనానికీ సైన్యం అండగా నిలిచింది.
- 1947 అక్టోబరులో పాక్ సైన్యం అండతో కొన్నిశక్తులు జమ్మూకశ్మీర్ సంస్థానాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించాయి. మహారాజా హరిసింగ్ అభ్యర్థన మేరకు రంగంలోకి దిగిన భారత సేనలు పాకిస్థాన్ సేనలను తిప్పికొట్టాయి. 1949లో కాల్పుల విరమణ ఒప్పందం కారణంగా జమ్మూకశ్మీర్‌కు చెందిన మూడోవంతు భూభాగం పాక్ చేతుల్లో ఉండిపోయింది. దీన్నే పాక్ ఆక్రమిత కశ్మీర్‌గా పిలుస్తున్నాం. ఈ యుద్ధ పరిణామాలు నేటికీ రెండుదేశాల భౌగోళిక రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉన్నాయి.
- సరిహద్దు వివాదం నేపథ్యంలో చైనా 1962లో యుద్ధానికి దిగింది. సరైన సన్నద్ధత కొరవడటంతో భారత్ వైఫల్యం చవిచూడాల్సి వచ్చింది. డ్రాగన్ దండయాత్ర మనకు అనేక పాఠాలు నేర్పింది. దీంతో లాల్‌బహదూర్ శాస్త్రి.. సోవియట్ యూనియన్ సహకారంతో రక్షణ రంగం ఆధునికీకరణకు బాటలు వేశారు.
- 1965లో ఆధునిక ఆయుధాలతో దురాక్రమణకు దిగిన పాకిస్థాన్‌ను భారత సైన్యం చావుదెబ్బ తీసింది. తొలిసారి మన వాయుసేన రంగంలోకి దిగి పాక్ స్థావరాలను నేలకూల్చింది.
- తూర్పు పాకిస్థాన్ (బంగ్లాదేశ్) విమోచన నిమిత్తం భారత్-పాకిస్థాన్‌ల మధ్య 1971లో యుద్ధం చోటుచేసుకుంది. పాక్ రెండు ముక్కలై బంగ్లాదేశ్ స్వతంత్ర రాజ్యంగా ఆవిర్భవించింది.
- 1999లో పాక్ సైనికులు గొర్రెల కాపరుల ముసుగులో కార్గిల్, లద్దాఖ్ పర్వత శిఖరాలను ఆక్రమించారు. భారత్ నుంచి సియాచిన్‌ను వేరుచేయాలన్న కుట్రను ఇండియా చిత్తుచేసింది.
- 2020లో తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్ లోయలో చొచ్చుకువచ్చేందుకు ప్రయత్నించిన చైనా దళాలనూ భారత సైన్యం దీటుగా తిప్పికొట్టింది.
- పాకిస్థాన్‌తో భారత్ నాలుగు యుద్ధాలు చేసింది. వాటిలో 1999 నాటి కార్గిల్ యుద్ధం.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తున జరిగిన సమరంగా చరిత్రకెక్కింది.
- 1950 కొరియా యుద్ధంలో భారత దళాలు వైద్యసాయం అందించాయి. ఐరాస ఇప్పటివరకూ నిర్వహించిన 71 శాంతి రక్షక కార్యకలాపాల్లో భారత్ 49 సార్లు సేవలు అందించింది. సుమారు 2 లక్షల మంది భారత సైనికులు పాల్గొన్నారు.
- అంకుర పరిశ్రమల భాగస్వామ్యంతో దేశ రక్షణ, భద్రతను బలోపేతం చేసేందుకు.. కేంద్ర ప్రభుత్వం 'ఇన్నోవేషన్స్ ఫర్ డిఫెన్స్ ఎక్స్‌లెన్స్' కార్యక్రమం చేపట్టింది.
ఎన్నో ఆపరేషన్లు..
పాకిస్థాన్, మయన్మార్‌లలోని ఉగ్రవాదుల స్థావరాలను మన దళాలు ధ్వంసం చేశాయి. స్వదేశంలో తీవ్రవాదులపై పోరాటం, ఖలిస్థాన్‌వాదులపై ఆపరేషన్ బ్లూస్టార్, సియాచిన్లో పాక్ పీచమణచడం, శ్రీలంకలో భారత శాంతిసేన కార్యకలాపాలు, యెమెన్ నుంచి భారతీయుల తరలింపు వంటి క్లిష్టమైన సవాళ్లను మన బలగాలు సమర్థంగా చేపట్టాయి.
- ఆత్మనిర్భర్ భారత్ సాకారానికి కేంద్రం 'అగ్నిపథ్'ను తీసుకొచ్చింది. ఈ పథకం కింద సాయుధ బలగాల్లో నాలుగేళ్లపాటు సేవలు అందించేందుకు యువతను నియమిస్తుంది.
- చైనా, పాకిస్థాన్, మయన్మార్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో 3,595 కి.మీ. రహదారులను రూ.20,767 కోట్లతో భారత్ నిర్మిస్తోంది.
- అమెరికా యుద్ధనౌక యూఎస్‌ఎన్‌ఎస్ ఛార్లెస్ డ్రూ.. మరమ్మతుల కోసం ఇటీవల చెన్నై చేరుకుంది. అగ్రరాజ్య నేవీ షిప్ మన దేశంలో మరమ్మతులు చేయించుకోవడం ఇదే మొదటిసారి.
భారత్‌లో తయారీ'తో ఊపు..
'మన ఆయుధాలను మనమే తయారు చేసుకుందాం. వాటిని మరొకరికి అమ్మే స్థాయికి ఎదుగుదాం' అనే నినాదంతో భారత్ కొత్త అడుగులు వేస్తోంది. శత్రుదేశాల కంటే దీటుగా, అగ్రదేశాలకు పోటీగా నవతరం ఆయుధాల తయారీలో ముందడుగు వేస్తోంది. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ, హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తదితర సంస్థలు ఈ క్రతువులో నిమగ్నమయ్యాయి.
- రష్యా నుంచి కొనుగోలుచేసిన టి-53, టి-72, టి-90 యుద్ధట్యాంకులు ఉండగా.. 'కర్ణ' పేరుతో అత్యాధునిక యుద్ధ ట్యాంకులు తయారీదశలో ఉన్నాయి.
- పైలట్ రహిత యుద్ధ విమానాలు నిషాంత్, లక్ష్య, రుస్తుంను డీఆర్డీవో అభివృద్ధి చేసింది. ఐఎన్‌ఎస్ విశాఖపట్నం తదితర యుద్ధనౌకలు దేశరక్షణలో నిమగ్నమయ్యాయి.
- విశాఖలోని హిందుస్థాన్ షిప్‌యార్డ్ 'ఐఎన్‌ఎస్ అరిహంత్' జలాంతర్గామిని నిర్మించి.. భారత్‌ను అణు జలాంతర్గాములున్న ఆరో దేశంగా నిలిపింది.
- సూపర్ సోనిక్ బ్రహ్మోస్-1 క్షిపణిని రష్యా సహకారంతో మన దేశం సిద్ధం చేసింది.