National flag in eye: తమిళనాడు.. కోయంబత్తూరులోని కునియముతుర్కు చెందిన యూఎస్డీ రాజా అనే సూక్ష్మ కళాకారుడు దేశభక్తిని వినూత్నంగా చాటుకున్నాడు. కంటిలో జాతీయ జెండా పెయింటింగ్‌ను వేసుకున్నాడు. కంటిలో జాతీయ జెండాను తీర్చిదిద్దేందుకు ఎనామిల్ పెయింట్‌ను వాడాడు. రాజా స్వతహాగా స్వర్ణకారుడు. చాలా సార్లు సూక్ష్మ కళా చిత్రాలను రూపొందించాడు. దేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ వినూత్న కళకు శ్రీకారం చుట్టాడు.
ప్రతి సంవత్సరం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రకరకాలుగా పెయింటింగ్స్ గీస్తాడు రాజా. ఈ సంవత్సరం దేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవానికి ప్రజలకు ఓ అరుదైన కళాఖండాన్ని అందించాలని అనుకున్నాడు. అప్పుడే తన స్కూల్లో చదివిన 'జాతీయ జెండాను కంటికి రెప్పలా కాపాడుకుంటాం' అనే నినాదం గుర్తుకొచ్చింది. అలా జాతీయ జెండాను కంటిలో రూపొందించాలని నిర్ణయించుకున్నాడు రాజా.
జాతీయ జెండాను కంటిలో తీర్చిదిద్దాలని ప్రయత్నించినప్పుడు చాలా ఇబ్బందులు పడ్డాను. కంటి వైద్యుడిని సంప్రదించా. ఇలా చేస్తే కంటికి ప్రమాదం అని ఆయన హెచ్చరించారు. అయినా నా మనసు ఒప్పుకోలేదు. ఎనామిల్ పెయింట్‌తో జాతీయ జెండాను గీసి కంటికి పెట్టాను. అద్దం చూసుకుని నేనే స్వయంగా పెయింటింగ్‌ను వేసుకున్నాను. దీన్ని పూర్తి చేయడానికి కొన్ని గంటల సమయం పట్టింది. 16 సార్లు ప్రయత్నించి విఫలమయ్యాను. ఆఖరికి 17వ సారి విజయం సాధించాను. అప్పుడు నాకు స్వాతంత్ర్యం వచ్చినట్లు అనిపించింది. విద్యార్థులు, పిల్లలు ఇలాంటి కళాకృతులను కంటిలో గీసుకునేందుకు ప్రయత్నించవద్దు. ఇలా చేయడం కంటికి చాలా ప్రమాదకరం.