Sonia Gandhi News: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ఈడీ ప్రశ్నిస్తున్న నేపథ్యంలో.. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసనకు దిగాయి. దిల్లీ సహా పలు రాష్ట్రాల్లో పార్టీ కార్యకర్తలు కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పోరాటం చేస్తున్నారు. పలు చోట్ల నిరసనలు ఉద్ధృతంగా మారాయి. ఆందోళనకారులను నిలువరించేందుకు జలఫిరంగులు ప్రయోగిస్తున్నారు పోలీసులు. మరోవైపు సీడబ్ల్యూసీ సభ్యులు, కాంగ్రెస్ ఎంపీలను నిర్బంధించారు. అంతకుముందు నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ విచారణ కోసం సోనియా గాంధీ.. దిల్లీలోని ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు.
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. పార్టీ కీలక నేతల్ని అదుపులోకి తీసుకుంటున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం, అజయ్ మాకెన్, అధీర్ రంజన్ చౌదరి, మాణికం ఠాగూర్, కె.సురేశ్, హరీశ్ రావత్, శశి థరూర్ సహా పలువురిని బస్సుల్లోకి ఎక్కించి నిర్బంధించారు. సుమారు 75 మంది కాంగ్రెస్ ఎంపీలను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
దిల్లీలో నిరసనలు తీవ్రంగా మారాయి. పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనల్లో పాల్గొనగా.. వారిని నిలువరించేందుకు పోలీసులు జల ఫిరంగులు ప్రయోగించారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం ముందు నిరసన చేస్తున్న పలువురు ఎంపీలను నిర్బంధించినట్లు పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ ఆరోపించారు.
సోనియా గాంధీపై ఈడీ విచారణను వ్యతిరేకిస్తూ అసోం గువాహటిలో కాంగ్రెస్ కార్యకర్తల నిరసనలు తారస్థాయికి చేరాయి. కాంగ్రెస్ శ్రేణులు, పోలీసుల మధ్య ఘర్షణ చెలరేగింది. అనంతరం.. కొందరు కాంగ్రెస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో కాంగ్రెస్ మహిళ కార్యకర్తలు.. సోనియాకు పెద్ద ఎత్తున మద్దతుగా నిలిచారు. అయితే.. వారందరినీ పోలీసులు బస్సుల్లో ఎక్కించి తీసుకెళ్లారు.
రాజస్థాన్ కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు శాంతియుతంగా నిరసనలు తెలిపారు. ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థల్ని కేంద్రం దుర్వినియోగం చేస్తోందని ప్లకార్డులు పట్టుకొని నినదించారు.