అట్టహాసంగా గణతంత్ర వేడుకలు.. జెండా ఎగురవేసిన ముర్ము.. హాజరైన ఈజిప్ట్ అధ్యక్షుడు, ప్రధాని మోదీ 74 వ గణతంత్ర వేడుకలు దేశ రాజధాని దిల్లీలో అట్టహాసంగా జరిగాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ యుద్ధ స్మారకం సందర్శనతో గణతంత్ర వేడుకలు ప్రారంభమయ్యాయి. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, త్రివిధ దళాల అధిపతులతో కలిసి జాతీయ యుద్ధ స్మారకాన్ని సందర్శించిన ప్రధాని దేశసేవలో అమరులైన వీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం అక్కడ నుంచి రాజ్‌పథ్‌కు చేరుకున్న ప్రధాని.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు స్వాగతం పలికారు.
సాయుధ దళాల గన్స్ సెల్యుట్ తర్వాత త్రివర్ణ పతాక ఆవిష్కరణ జరిగింది. ఎంఐ 17 వీ5కి చెందిన నాలుగు హెలికాప్టర్లు ఆకాశం నుంచి పూలు వెదజల్లాయి. సంప్రదాయ గన్ సెల్యూట్‌కు ఉపయోగించే పురాతన బ్రిటిష్ పౌండర్ గన్స్ స్థానంలో 105 ఎంఎం లైట్ ఫీల్డ్ గన్లను ఉపయోగించారు. రాష్ట్రపతి పదవి చేపట్టిన తర్వాత తొలిసారి కర్తవ్యపథ్‌లో ద్రౌపదీ ముర్ము త్రివర్ణ పతకాన్ని ఆవిష్కరించారు.
గణతంత్ర వేడుకల్లో రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతా అల్ సీసీ విజయ్ చౌక్ నుంచి ఎర్రకోట వరకు సాగిన పరేడ్‌లో త్రివిధ దళాలు తమ సత్తాను ప్రపంచానికి చాటిచెప్పాయి. ఆత్మనిర్భర్ భారత్ కింద పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన యుద్ధ ట్యాంకులు, ఆయుధాలు ఇందులో ప్రదర్శించారు. ప్రధాన యుద్ధ ట్యాంక్ అర్జున్, నాగ్ క్షిపణి వ్యవస్థ, కే-9 వజ్రా టీ గన్ సిస్టమ్, బ్రహ్మోస్ క్షిపణులు, బీఎంపీ-2 శరత్ పదాతిదళ పోరాట వాహనం, క్విక్ రియాక్షన్ ఫైటింగ్ హెవీ వెహికల్ పరేడ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రఫేల్, మిగ్-29, సుఖోయ్ 30, సుఖోయ్ 30 ఎమ్కేఐ జాగ్వార్, సి-130, సి-17, డోర్నియర్, డకోటా, ఎల్సిహెచ్ ప్రచంద్, అపాచీ వంటి యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు గగనతలంలో గర్జించాయి. రిపబ్లిక్ డే ఫ్లై ఫాస్ట్లో మొత్తం 44 వాయుసేన విమానాలు విన్యాసాలు చేశాయి.
దేశ సాంస్కృతిక భిన్నత్వం, వారసత్వం, ఆర్థిక, సామాజిక పురోగతికి అద్దంపట్టేలా సాగిన శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. మొత్తం 23 శకటాలు ఇందులో పాల్గొన్నాయి. ఆంధ్రప్రదేశ్, అసోం, గుజరాత్, కేరళ సహా 17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల శకటాలతో పాటు వివిధ మంత్రిత్వ శాఖలు ప్రభుత్వ విభాగాలకు చెందిన 6 శకటాలు ఇందులో పాల్గొన్నాయి. ఈజిప్ట్ నుంచి వచ్చిన 144 మందితో కూడిన ప్రత్యేక సైనిక పటాలం పరే పాల్గొన్నాయి. దేశ రక్షణ రంగంలో పెరుగుతున్న స్వదేశీ సామర్థ్యాలు, నారీ శక్తి, 'న్యూ ఇండియా' ఆవిర్భావానికి 74 గణతంత్ర దినోత్సవ వేడుకలు అద్దంపట్టాయి.
అంతకుముందు గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు చెప్పారు. 'స్వాతంత్ర్య సమరయోధుల కలలను నెరవేర్చేందుకు మనం ఐక్యంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. ఈ సారి గణతంత్ర వేడుకలు మరింత ప్రత్యేకం. ఎందుకంటే ఆజాదీ కా అమృత్ మహోత్సవం వేళ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం.' అని ప్రధాని మోదీ అన్నారు.
నేషనల్ వార్ మోమోరియల్ వద్ద అమరవీరులకు నివాళులు అర్పిస్తున్న ప్రధాని మోదీ నేషనల్ వార్ మోమోరియల్ వద్ద ఉన్న డిజిటల్ బుక్‌లో అభిప్రాయాలు రాస్తున్న ప్రధాని