అనారోగ్యంతో బాధపడుతున్న మనవడి ప్రాణాలు కాపాడింది 73 ఏళ్ల బామ్మ. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న మనవడిని చూడలేని ఆ వృద్ధురాలు.. తన కిడ్నీనే ఇచ్చింది. ఈ సంఘటన కర్ణాటకలో జరిగింది. యువకుడికి విజయవంతంగా ఆపరేషన్ పూర్తి చేసినట్లు వైద్యులు తెలిపారు.
మనవడి కోసం ప్రాణం పణంగా పెట్టిన బామ్మ.. 73 ఏళ్ల వయసులోనూ కిడ్నీ దానం - 73 year old grandmother donated organ
అనారోగ్యంతో బాధపడుతున్న మనవడిని చూడలేక తన కిడ్నీ ఇచ్చి అతడి ప్రాణాలు కాపాడింది 73 ఏళ్ల బామ్మ. ఈ సంఘటన కర్ణాటకలోని బెళగావిలో జరిగింది.
బెళగావి జిల్లాలోని హరుగేరి ప్రాంతానికి చెందిన సచిన్(21) అనే యువకుడు 18 ఏళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. కొద్ది రోజుల క్రితమే అతడి కిడ్నీ ఒకటి పూర్తిగా ఫెయిలైంది. దీంతో వారానికి రెండు సార్లు.. సచిన్ డయాలసిస్ చేసుకోవాల్సి వచ్చేది. తల్లిదండ్రులు కూడా అనారోగ్యంతో ఉండడం వల్ల.. వారి కిడ్నీలను అతడికి అమర్చేందుకు వీలు కాలేదు. దీంతో సచిన్ పడుతున్న బాధను చూడలేని బామ్మ.. మనవడికి తన కిడ్నీని ఇచ్చేందుకు ముందుకొచ్చింది. ఏడు పదుల వయస్సులోనూ కిడ్నీ దానం చేసింది. రవీంద్ర మద్రాకి అనే డాక్టర్ ఈ ఆపరేషన్‌కు నేతృత్వం వహించారు. ఈ వయస్సులోనూ కిడ్నీ దానం చేసిన వృద్ధురాలిని వైద్యుల బృందం ఘనంగా సత్కరించింది.
"ఈ మధ్యకాలంలో చాలా మంది కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. డయాబెటీస్, బీపీ దీనికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. సచిన్ కిడ్నీ కూడా ఇలాగే ఫెయిలైంది. దీంతో అతడికి కిడ్నీ మార్పిడి చేయాల్సి వచ్చింది. అందుకు అతడి బామ్మ ముందుకు వచ్చింది. ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేశాం. ప్రస్తుతం యువకుడు ఆరోగ్యంగానే ఉన్నాడు." అని డాక్టర్ రవీంద్ర మద్రాకి తెలిపారు. బామ్మ తనకు కిడ్నీ ఇవ్వడంపై సచిన్ ఆనందం వ్యక్తం చేశాడు. బామ్మ వల్లే తాను ఈ స్థితిలో ఉన్నానని చెప్పాడు.