70 Year Old Man Cheated 63 Year Old Woman :కుమారుడికి పెళ్లి సంబంధాలు చూస్తూ.. 63 ఏళ్ల వృద్ధురాలితో ప్రేమలో పడ్డాడు 70 సంవత్సరాల వయసున్న వృద్ధుడు. అనంతరం ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. బాధితురాలు గట్టిగా నిలదీయగా ఆమెను చంపేస్తానని బెదిరించాడు. అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది వృద్ధురాలు. కర్ణాటకలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
రాష్ట్ర రాజధాని బెంగళూరులో నివాసం ఉండే బాధితురాలి భర్త కొన్నాళ్ల క్రితం చనిపోయాడు. వృద్ధుడి భార్య కూడా మరణించింది. ఐదేళ్ల క్రితం వృద్దుడి కుమారుడికి పెళ్లి సంబంధాలు చూస్తుండగా.. వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. అనంతరం వీరి సమక్షంలోనే వృద్ధుడి కుమారుడి పెళ్లి జరిగింది.
ఇద్దరు కలిసి మైసూర్, దేవనాగరే, బెళగావి వంటి ప్రదేశాలను విహారయాత్రకు వెళ్లారు. అదే సమయంలో తనను పెళ్లి చేసుకోవాలని నిందితుడ్ని డిమాండ్ చేసింది బాధితురాలు. మొదట్లో అందుకు ఒప్పుకున్న వృద్ధుడు.. అనంతరం నిరాకరించాడు. గట్టిగా నిలదీయగా వృద్ధురాలిని చంపేస్తానని బెదిరించాడు. దీంతో బెంగళూరులోని తూర్పు డివిజన్ మహిళా పోలీస్ స్టేషన్లో నిందితుడిపై ఫిర్యాదు చేసింది బాధితురాలు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.